అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్...
కామారెడ్డి (విజయక్రాంతి): రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల ముసాయిదా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సభల్లో తెలియపరచి ఆమోదం తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) అన్నారు. మంగళవారం బిక్నూరు మండలం భాగీర్తిపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో కలెక్టర్ పాల్గొని కౌంటర్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాగుకు యోగ్యంగా ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల వివరాలు గ్రామ సభల్లో తెలియజేయాలని అన్నారు. భూమిలేని పేదలు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండి 2023-24 సంవత్సరంలో కనీసం 20 రోజుల పనిచేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద లబ్ది పొందవచ్చని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు వచ్చిన దరఖాస్తులపై విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. నాలుగు పథకాలకు సంబంధించి అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ గ్రామ సభలలో దరఖాస్తులు సమర్పించవచ్చనీ తెలిపారు. బిక్నూర్ మండల ప్రత్యేక అధికారిని, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిణి రజిత మాట్లాడుతూ... నాలుగు పథకాలు ఈ నెల 26 నుండి ప్రారంభం అవుతాయని, అర్హత కలవారు దరఖాస్తు చేసుకోవచ్చని, నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ నాలుగు పథకాలకు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి ముసాయిదా జాబితాలను గ్రామ సభలో ఆమోదించవలసి ఉంటుందని తెలిపారు. దోమకొండ మండలంలో లింగుపల్లి గ్రామ సభలో తీసుకుంటున్న దరఖాస్తుల కౌంటర్ లను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో ఆయా మండల తహసీల్దార్లు శివ ప్రసాద్, సంజయ్ రావు, దోమకొండ ప్రత్యేక అధికారిని, జిల్లా ఉద్యానవన అధికారిని జ్యోతి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, రెవిన్యూ, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి సిబ్బంది, ఆశలు, గ్రామస్తులు పాల్గొన్నారు.