17-05-2024 01:08:38 AM
గొర్రెల పంపిణీకి సర్కారు మంగళం
గొల్లకుర్మలకు డీడీ డబ్బులు వాపస్
గొర్రెల యూనిట్లే కావాలని లబ్ధిదారుల డిమాండ్
కరీంనగర్, మే 16 (విజయక్రాంతి): గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన గొర్రెల పంపిణీ పథకానికి కాంగ్రెస్ ప్రభు త్వం మంగళం పాడాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే రాష్ట్రస్థాయిలో పశుసంవర్థక శాఖ కార్యాలయంలో గొర్రెల పంపిణీకి సంబంధించిన ఫైళ్లు మాయం కావడంతో గత ప్రభుత్వం అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆగిపోయిన రెండో విడత గొర్రెల పంపిణీని తిరిగి ప్రారంభిస్తుందని గొల్లకుర్మలు ఆశించారు. అయి తే, రెండో విడతకు సంబంధించిన డీడీ డబ్బులను ప్రభుత్వం వాపస్ ఇస్తుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఆలస్యమైనా గొర్రెలు చేతికి వస్తాయనుకుంటే డీడీలు చేతిలో పెడుతుండటంతో ఈ పథకానికి ప్రభుత్వం మంగళం పాడినట్టేనని చర్చ మొదలైంది.
2,666 మందికి డీడీలు వాపస్
మొదటి విడత గొర్రెల పంపిణీలో భాగం గా లబ్ధిదారులకు ఒక్కో యూనిట్‌లో 20 గొర్రెలతోపాటు ఒక పొట్టేలును అందజేశారు. వీటి విలువ రూ.1.58లక్షలు. ఇందు లో ప్రభుత్వ రాయితీ పోగా లబ్ధిదారుడి వాటా రూ.43,750 డీడీల రూపంలో చెల్లించారు. రెండో విడతలో యూనిట్ విలువను పెంచారు. యూనిట్ విలువ రూ.౧.75 లక్షలుగా నిర్ణయించారు. లబ్ధిదారుడి వాటా రూ.43,700 డిపాజిట్ల రూపంలో పశుసంవర్థకశాఖ వసూలు చేసింది. కరీంనగర్ జిల్లా లో 3,404 యూనిట్లు మంజూరు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు ఆ నియోజవర్గంలో 718 గొర్రెల యూనిట్ల పం పిణీ చేశారు. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో రెండో విడత ఉంటుందని అనుకున్నప్పటికీ 2018 అసెంబ్లీ ఎన్నికలు ముగిసేనాటికి కేటాయింపులు జరగలేదు. మిగిలిన 2,666 మందికి డీడీలు తిరిగి చెల్లించే ప్రక్రియను ప్రస్తుతం అధికారులు ప్రారంభించారు. జిల్లాలో మొదటి విడతలో 11,236 యూని ట్లు పంపిణీ చేశారు. రెండో విడతలో 13,09 8 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా 3,404 యూనిట్లు మంజూరు చేశారు. ఈ రెండో విడత ఐదేండ్లుగా ఊరిస్తూ లబ్ధిదారులకు చివరకు నిరాశను మిగిల్చింది.