- ఏజెన్సీలో ఆదివాసీలకు ‘సాండ్’ తవ్వకాలు, రవాణాపై సర్వ హక్కులు
- ప్రత్యేక నిర్ణయాధికారాలతో కొందరి ఐఏఎస్‌ల దగా
- ‘పీసా’ చట్టానికి తూట్లు.. నిబంధనలకు నీళ్లు..
- బినామీ కాంట్రాక్టర్ల బిల్లులపై దర్జాగా సంతకాలు
- పదేళ్లలో రూ.600 కోట్ల మేర చెల్లింపులు.. రూ.100 కోట్ల మేర జీఎస్టీ ఎగవేత
- భద్రాద్రి, ములుగు జిల్లాల పరిధిలో భారీగా అక్రమాలు
- విచారణ చేపడితే బయటపడే బాగోతాలెన్నో!
రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ, చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సిన కొందరు ఐఏఎస్ అధికారులు కాసులకు కక్కుర్తిపడ్డారు. ఆదివాసీల ఇసుక సహకార సంఘాల పరిధిలో అక్రమాలకు పాల్పడ్డారు. ఆదివాసీల పొట్టగొట్టి ఆదివాసీతర బినామీ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయల సొమ్ము కట్టపెట్టారు.
భద్రాద్రి, ములుగు జిల్లాల పరిధిలో ఇసుక తవ్వకాలు, రవాణాకు సంబంధించి ఏకంగా రూ.600 కోట్ల మేర అక్రమంగా చెల్లించారు. ఈ స్కామ్‌లో తెలంగాణ వచ్చిన తర్వాత ఐఏఎస్‌లదే ప్రధాన పాత్ర అనే చర్చ ఉభయ జిల్లాల్లోనూ నడుస్తున్నది.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 17 (విజయక్రాంతి) :
షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీరాజ్ విస్తరణ (పీసా) చట్ట ప్రకారం పుష్కరం క్రితం భద్రాచలం ఐటీడీఏ పీవోగా పనిచేసిన వీరపాండ్యన్, నాటి సబ్‌కలెకలెక్టర్ నారాయణ గుప్త, పాటు ఓ జిల్లా అధికారి గొమ్ముకొత్తగూడెం, భద్రాచలం, గొమ్ముగూడెం, మొర్రవానిగూడెం, మరికాలు ఇసుక సొసైటీలకు నామినేటెడ్ పద్ధతిలో కాకుండా టెండర్ విధానం ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేశారు.
తక్కువ కోట్ చేసిన వారికి పనులు అప్పగించారు. నిబంధనల ప్రకారం ఆదివాసీ సహకార సంఘాలు మాత్రమే ఇసుకను తవ్వించి లోడింగ్ చేయాలి. అనంతరం రవాణా చేయాలి. ఈ పనుల్లో మూడోవ్యక్తి అగ్రిమెంట్లు ఉండకూడదు. అలా సహకార సంఘానికి ఒక క్యూబిక్ మీటర్‌కు చొప్పున ప్రతిఫలం అందుతుంది. అలా ఇసుక తవ్వకాలు, లోడింగ్ రవాణాకు సహకార సంఘాల పేరుతో ఆదివాసీలకు మేలు చేశారు.
నిబంధల ప్రకారం ఎవరికైనా అగ్రిమెంట్లు చేసినా, ఇసుక తవ్వకాలను ఇతరులకు అప్పగించినా టీజీఎండీసీ అగ్రిమెంటు రద్దు, చెల్లింపులు నిలిపివేయాల్సి ఉంటుంది. కానీ, క్రమంగా ఆ పనులు బినామీ కాంట్రాక్టర్ల పరమయ్యాయి. వందలాది కోట్లు వారి భోషాణా లు నింపాయి. అదంతా ఎలా జరిగిందో విచారణ చేపడితేనే కానీ బహిర్గతం కాదు.
గతంలో కొంత ప్రయత్నం..
ప్రస్తుత రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ అధికారి ఆకునూరి మురళి గతంలో భూపాలపల్లి కలెక్టర్‌గా పనిచేశారు. నాడు బినామీ కాంట్రాక్టర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కొంత ప్రయత్నించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూరవీడులో జిల్లా ఇసుక కమిటీ ఆధ్వర్యంలో గ్రామసభ సైతం ఏర్పాటు చేశారు. అవసరమైతే సహకార సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని నచ్చచెప్పారు.
దయచేసి పనులను బినామీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించవద్దని విజ్ఞప్తి చేశారు. అందుకు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి కౌంటర్ గ్యారెంటీ ఇప్పిస్తామని బ్యాంకు మేనేజర్లను సైతం ఒప్పించారు. తర్వాత ఆయన అక్కడి నుంచి బదిలీ కావడంతో పరిణామాలన్నీ మారిపోయాయి.
తర్వాత కొంతకాలానికి భద్రాచలం పీవోగా వచ్చిన వీపీ గౌతమ్ సైతం ఇలాంటి ప్రయత్నమే చేశారు. బినామీ కాంట్రాక్టర్ల విషయంపై సీరియస్‌గా స్పందించారు. వారికి సంబంధించిన చెక్కులపై సంతకం పెట్టడానికి నిరాకరించారు.
విచారణ చేపడితేనే..
నిబంధనలకు విరుద్ధంగా గడిచిన పదేళ్లలో రూ.600 కోట్ల సొమ్ము బినామీ కాంట్రాక్టర్ల ఖాతాల్లో జమ అయ్యాయని సమాచారం. అలాగే సర్కార్‌కు అందాల్సిన రూ.100 కోట్ల జీఎస్టీని సైతం ఎగవేశారని ప్రచారం రెండు జిల్లాల్లో జరుగుతోంది. దీనిపై యంత్రాంగంలో కదలిక వచ్చిందని, ఆయా సహకారం సంఘాలకు త్వరలో నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం.
రాష్ట్ర సహకార సంఘం ఉన్నతాధికారులు స్పందించి వెంటనే విజిలెన్స్ ద్వారా దర్యాప్తు చేపడితే అక్రమార్కుల లెక్కలు తేలుతాయని, స్కాంలో ఎవరి పాత్ర ఎంత అనేది తేటతెల్లమవుతుందని ఉభయ జిల్లాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సహకార చట్టాలు ఇలా..
1964 సహకార చట్టం, 1995 పరస్పర సహాయ సహకార చట్టం ద్వారా ఆదివాసీ ఇసుక సహకార సంఘాలు ఏర్పడ్డాయి. నిబంధనల ప్రకారం సహకార సంఘం అధ్యక్షుడు, కోశాధికారి పేరుతో బ్యాంకు అకౌంట్ల నిర్వహణ ఉండాలి. మిగతా సభ్యులు లావాదేవీలు చేసేందుకు వీలు లేదు. ఆదివాసీ ఇసుక సహకార సంఘాలకు ఐటీడీఏ పీవోలు జాయింట్ అకౌంట్లు నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
2016 పనిచేసిన ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు బినామీ కాంట్రాక్టర్ల చెక్కులపై నేరుగా సంతకాలు చేశారని, అది వివాదాస్పదం కావడంతోనే వారు రెండు అకౌంట్ల విధానానికి తెర లేపారనే ప్రచారం జరుగుతోంది. సదరు యంత్రాగానికి భారీగా మామూళ్లు ముట్టాయనే ప్రచారం జోరుగా సాగుతున్నది.
బినామీ కాంట్రాక్టర్లకు ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.180 చొప్పున అందుతున్నదని, అలా రూ.కోట్లను బినామీ కాంట్రాక్టర్లు కుల్లగొట్టారని సమాచారం. బిడ్డింగ్ ద్వారా రూ.150కే కోట్ చేసిన వారికి పనులు అప్పగిస్తూనే, సహకార సంఘానికి లబ్ధి చేకూరే అవకాశం ఉన్నప్పటికీ సదరు అధికారులు అలా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పీసా చట్టం ఏం చెప్తోంది?
పీసా చట్ట ప్రకారం ఏజెన్సీలో చిన్నతరహా ఖనిజాల తవ్వకాలు, అమ్మకాలను స్థానిక ఆదివాసీ సహకార సంఘాలకే అప్పగించాలి. తద్వారా ఆదివాసీలకు ఆర్థిక దన్ను కల్పించాలి. అందుకు ప్రత్యేకంగా గ్రామసభలు నిర్వహించాలి. కానీ, కాసుల కోసం కక్కుర్తిపడిన అధికారులు ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ఆదివాసీ సహకార సంఘాలకు అప్పగించకుండా రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) ద్వారా నేరుగా వ్యాపారానికి తెర లేపారు.
అలా తవ్వకాలు, అమ్మకాల అనుమతుల పెత్తనం టీజీఎండీసీకి వెళ్లింది. ఆ కార్పొరేషన్ గోదావరిలో ఇసుక తీయడం స్టాక్ యార్డుకు తరలించడం, అక్కడ లోడింగ్ చేయడం వంటి పనులను మాత్రమే ఆదివాసీ సహకార సంఘాలకు అప్పగించి చేతులు దులుపుకొన్నది.
కార్పొరేషన్ ఒక క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.600 నుంచి రూ.650 వరకు ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ, ఆదివాసీ సహకార సంఘాలకు కేవలం రూ.220 మాత్రమే చెల్లిస్తూ వచ్చింది. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి సమీక్ష లేకపోవడంపై ఉభయ జిల్లాల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొందరు ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదని తెలిసింది.
ఇసుక మాఫియా దాడి
బూర్గంపాడు మండలం సారపాకలో శనివవారం రాత్రి గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు బూర్గంపాడు డిప్యూటీ తహసీల్దార్ రామ్ నరేష్, ఆర్‌ఐ ముత్తయ్య తమ సిబ్బందితో కలిసి పరిశీలనకు వెళ్లారు. అక్కడ అక్రమార్కులు వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.