- కిరాణషాపుల్లో యథేచ్ఛగా మద్యం అమ్మకాలు
- మద్యానికి బానిసై రోడ్డున పడుతున్న కుటుంబాలు
- పచ్చని సంసారాలను పాడుచేస్తున్న మద్యం
- ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపిస్తుందంటూ ఆరోపణలు
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపిస్తుండడంతో గ్రామాల్లో బెల్ట్ షాప్‌లు జోరుగా కొనసాగుతు న్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం నియోజకవర్గ పరిధి మంచాల, యాచారం, ఇబ్రహీం పట్నం మండలాల్లోని చాలా గ్రామాలు రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా మత్తులో జోగుతున్నాయని ప్రజ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాగేందుకు నీరు లేక ఇబ్బం దులు పడే గ్రామాలు ఉన్నాయి కానీ, మందు దొరకని గ్రామం లేదనడంలో ఏలాంటి ఆశ్చర్యం లేదు. పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా నడుపుతున్నా ఎక్సైజ్ అధికారులు చూసి, చూడనట్లుగా వ్యవహరిస్తు న్నారనే ఆరోపణలు న్నాయి.
గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్ట్ దుకాణాలు నిబంధ నలకు విరుద్ధంగా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నా వీటిని కట్టడి చేయడంలో ఎక్సైజ్ అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారని ప్రజలు మండిపడు తున్నారు. వైన్స్ యజమానులు, ఎక్సైజ్ అధికారుల అండదండాలతోనే గ్రామాలు, తండాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతు న్నాయని, ఇదంతా కూడా అధికారుల కనుసన్నల్లోనే సాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
అనేకమంది బెల్ట్ షాప్లో మద్యం కొనుగోలు చేసి జేబులు గుల్ల చేసుకుంటు న్నారు. అప్పులు చేసి తాగడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతూ, పచ్చని సంసారాలు ఆగం అవుతున్నాయని చాలామంది మహిళలు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికైనా బెల్ట్ షాప్లపై ఎక్సైజ్ అధికారులు దృష్టిసారించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఎనీ టైం మందు...
సమయం ఏదైనా.. ఎనీ టైం మందు లభ్యం అంటున్న బెల్ట్ షాప్ నిర్వాహకులు. కిరాణ షాపులు చాటున మద్యం అమ్మకాలు చేపడుతూ రాత్రి వేళలో సైతం తలుపు తట్టి పలానా వాడిని వచ్చానంటే ఏ టైంలోనై మద్యం ఇస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచే షాపుల్లో మద్యం లభిస్తుందంటే ఏ మేరకు బెల్ట్‌షాపులు నడుస్తున్నాయనేది అర్థం చేసుకోవచ్చు. వ్యాపారాభివృద్ధి కోసం మద్యం వ్యాపారులు కొత్తదారులను వెతుకుతున్నారు. చాల చోట్ల మద్యం తాగి ఇళ్ల మధ్యలో గొడవలు పడుతూ అర్ధరాత్రి వరకు నానా రభస చేస్తున్నారు
మద్యం పట్టుబడితే చర్యలు తప్పవు...
గ్రామాల్లో ఎవరైనా నిబందనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు సాగిస్తే చర్యలు తప్పవు. యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాలలోని సమస్యా త్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెంచాం. ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లో తప్పకుండా రైడ్ చేస్తున్నాము. ఎక్కడైన అక్రమ మద్యం సరఫరా, బెల్టు షాపులు నిర్వహిస్తే సహించేది లేదు. మద్యం పట్టుబడితే చర్యలు తప్పవు.
సీతారాంరెడ్డి, ఎక్సైజ్ సీఐ, ఇబ్రహీంపట్నం సర్కిల్