- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో యువతకు ఎర
- రహదారుల వెంట అడ్డగోలుగా సిట్టింగులు
- తాగుబోతులుగా మార్చుతున్న నేతలు
- మాముళ్ల మత్తులో ఎక్సైజ్, పోలీస్ అధికారులు!
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): గ్రామాల్లో బెల్టుషాపుల జోరు నడుస్తున్నది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బరిలో ఉండే ఆశావా హులు ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం మద్యం దావత్‌లు ఇస్తు న్నారు. కుల సంఘాల వారిగా యువతకు మద్యంను అలవాటు చేసి వారిని అతి పిన్న వయస్సులోనే తాగుబోతులుగా మారుస్తున్నారు.
దీంతో యువకులు రహదారుల వెంబడే అడ్డగోలుగా సిట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. బెల్ట్ దుకాణాల నుంచి ఎక్సైజ్, పోలీస్ అధికారులు నెలవారి మా ముళ్లు తీసుకుని ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తున్నది.
దీంతో రాజకీయ నేతలు ఇచ్చే మద్యం సేవిస్తున్న యువకులు మత్తులో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. ఈ క్రమంలో ని త్యం తాగుడుకు బానిసలుగా మారి కొన్నిసార్లు డబ్బులు లేక చోరీలు చేయడానికి సైతం వెనకాడటంలేదు. అయినా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
బెల్ట్ షాపులకు అండగా వైన్స్‌లు..!
ఎమ్మార్పీ కంటే అత్యధిక రేటు దొరుకుతుందన్న ఉద్దేశంతో వైన్స్‌ల నిర్వాహకులు గ్రామాల్లోని బెల్టుషాపులకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు 30 నుంచి 50 వరకు బెల్ట్ దుకాణాలు ఉన్నాయి. బెల్టుషాపులపై దాడులకు అధికారులు వెళ్తున్న సమాచారాన్ని కూడా ముందుగా వైన్స్ దుకాణాల యజమానులు బెల్టు షాప్ నిర్వాహకులు చేరవేస్తూ కాపాడుతున్నారు.