calender_icon.png 6 March, 2025 | 11:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లి ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదు..

06-03-2025 08:08:46 PM

బెల్లంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ అఫ్జల్...

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ బెల్లంపల్లి ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని బెల్లంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గురువారం మహమ్మద్ అఫ్జల్ సోషల్ మీడియాలో ఆరోపించడం బెల్లంపల్లి కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ క్యాంపు ఆఫీసుకు రావడంలేదని, నెలలు ఒకటి రెండు సార్లు రావడం, తన భజనపరులను కలుసుకొని వెళ్తున్నారని ఆరోపించారు. సీనియర్ నాయకులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని, కనీసం కలవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను గుర్తించి పదవుల పంపకాల్లో న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమికి కారణం నాయకత్వ లోపమేనని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలలో అవగాహన ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు గెలుపు కోసం పనిచేశారని ఆరోపించారు.

బెల్లంపల్లి పట్టణంలో గాని, మండలంలో గాని ఇలాంటి ప్రచారం చేయకపోవడం, పట్టభద్రులను కలవకపోవడం వల్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి చెందారని ఆరోపించారు. మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో పరిస్థితి ఒకలాగా ఉంటే బెల్లంపల్లిలో ఫైనాన్షియల్ గా కార్యకర్తలు కనీస సమాచారాన్ని సీనియర్ నాయకులకు, పట్టణ నాయకులకు అందించలేదని ఆరోపించారు. ఎలాంటి సమాచారం అయినా భజనపరులకు మాత్రమే ఇస్తున్నారని, సీనియర్ నాయకులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో కూడా ఇలాగే వ్యవహరిస్తే పార్టీ నాయకత్వానికి తెలియపరుస్తామని అన్నారు. గాంధీభవన్ కి వెళ్లి పార్టీ నాయకులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.

సీనియర్ నాయకులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ అధిష్టానంపై ఉందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో జేబులో నింపుకుంటున్న భజనపరులకు ఎవరు సహకరించవద్దని ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆయన కోరారు. ఈనెల 5న గాంధీభవన్లో జరిగిన పెద్దపెల్లి పార్లమెంటు స్థాయి కార్యకర్తల సమావేశం సమాచారం కూడా తమకు తెలుపలేదని ఆవేదన చెందారు. అఫ్జల్ చేసిన ఈ ఆరోపణలు ప్రస్తుతం బెల్లంపల్లి కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలుక ఆకాష్ దీనిపై స్పందిస్తూ ఆయన చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అదే సోషల్ మీడియాలో పేర్కొన్నారు.