calender_icon.png 22 December, 2024 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువు ముగిసినా బేఖాతర్!

04-07-2024 01:19:38 AM

  1. బియ్యం ఇచ్చేందుకు మిల్లర్లు ససేమిరా
  2. ప్రభుత్వ ఆదేశాలంటే లెక్కేలేదు

రూ.100 కోట్ల సీఎంఆర్ రికవరీపై సర్కారు ఉదాసీనత

కామారెడ్డి, జూలై ౩ (విజయక్రాంతి): ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ రైస్ మెక్కేసిన రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో సర్కారు ఉదాసీనత చూపుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూ.100 కోట్లకు పైగా సీఎంఆర్ బియ్యాన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. గత నెలలో సీఎంఆర్ ఇవ్వాల్సిన మిల్లర్లకు ప్రభుత్వం నోటీస్‌లు అందించింది. జూన్ 25 లోగా ప్రభుత్వానికి బియ్యం అప్పగించాలని గడువు విధించింది. కాగా, మిల్లర్లు సిండికేట్‌గా మారి ప్రభుత్వ తీరుపై పోరు కు సిద్ధమవుతుండటంతో చర్యలకు వెనుకడుగు వేస్తుంది. ఒక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రూ.100 కోట్ల సీఎంఆర్ ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం ఒక్క మిల్లరు మాత్రమే సీఎంఆర్ అప్పగించారు. మిగతా 36 మంది ప్రభుత్వ ఆదేశాలను లెక్కే చేయడం లేదు. 

అధికారులపై అనుమానాలు

సీఎంఆర్ చెల్లించాలని చెప్తున్న ప్రభుత్వ ఆదేశాలను రైస్‌మిల్లరు పట్టించుకోకపోవడంపై ప్రజలు విస్మయం చెందుతున్నారు. మిల్లర్లతో అధికారులు కుమ్మక్కయ్యారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నా యి. సీఎంఆర్ అప్పగించని మిల్లర్లపై ఆర్‌ఆర్ యాక్ట్ క్రిమినల్ కేసులు చేసే అధికారం ఉన్నా సంబంధిత శాఖ అధికారులు ముందడుగు వేయట్లేదు. ఈ కుంభకోణంలో కొంత మంది ప్రజాప్రతినిధులు, అప్పటి రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధుల హస్తం ఉందనే ఆరోపణలు వినవస్తున్నాయి.

ఇప్పుడున్న పాలకవర్గం కూడా స్పందించకపోవడంతో  ప్రభుత్వానికి రావాల్సిన సీఎంఆర్ మిల్లర్లు ఇవ్వడం లేదు. సీఎంఆర్‌ను మెక్కిన మిల్లర్లపై చర్యలకు పూనుకుంటేనే మిగతా వారు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం అప్పగిస్తారని తెలుస్తోంది. వందల కోట్ల బియ్యాన్ని మెక్కిన మిల్లర్లపై చర్యలు లేకపోవడంపట్ల సీఎంఆర్‌ను నిజాయితీగా అప్పగించిన మిల్లర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరును తప్పు పడుతున్నారు. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి మరో న్యాయమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాము నష్టపోయినా ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యాన్ని చెల్లించామని కొందరు మిల్లర్లు స్పష్టంచేస్తున్నారు.

సర్కారుతో మిల్లర్ల దోబూచులాట 

మిల్లర్లు కాజేసిన రూ.వంద కోట్ల బియ్యాన్ని రికవరీ చేయడంలో ప్రభుత్వం ఉదాసీనత కనబరుస్తుంది. అధికార యంత్రాంగం ఏం చేయ బోతుందో ముందుగానే మిల్లర్లకు సమాచారం లీక్ అవుతుంది. ముందుగానే సమాచారం తెలుస్తుండటంతో మిల్లర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లాలో సీఎంఆర్ బియ్యం మెక్కిన మిల్లర్లపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర స్థాయి అధికార బృందం వస్తే.. తాము జిల్లాలోని మొత్తం మిల్లులను బంద్ చేస్తామని అధికారులనే హెచ్చరించడంతో వారు చర్యలకు  వెనుకంజ వేశారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందిన రైస్‌మిల్లుపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేశారని అధికారులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.. కామారెడ్డి జిల్లాలో 36 మంది మిల్లర్లపై చర్యలకు వెనుకాడుతున్నారు. 

మిల్లర్లపై చర్యలకు వెనుకడుగు

కామారెడ్డి జిల్లాలో 36 మంది మిల్లర్లు సీఎంఆర్ బియ్యాన్ని నొక్కేసి ప్రభుత్వానికి అప్పగించకున్నా చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. వారిపై ఆర్‌ఆర్ యాక్ట్, క్రిమినల్ కేసులు నమోదు చేసి రికవరీ చేసే అవకాశాలు ఉన్నా.. ప్రభుత్వం పట్టింపులేనట్టు వ్యవహరిస్తున్నది. చిన్న చిన్న విషయాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. మిల్లర్ల విషయంలో మెతకవైఖరిని అవలంబించడం అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వ పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటం వల్ల పౌరసరఫరాల శాఖధికారులు చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తుంది.  

సీఎంఆర్ రికవరీకి చర్యలు  

కామారెడ్డి జిల్లాలో 36 మంది రైస్‌మిల్లర్ల నుంచి 70 వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ప్రభుత్వానికి రావాల్సి ఉంది. సుమారు రూ.70 కోట్ల బియ్యం కామారెడ్డి జిల్లాలోని రైస్ మిలర్లు ప్రభుత్వానికి బకాయి ఉన్నారు. వారందరికీ ఇప్పటికే నోటీసులు పంపించాం. గడువు కూడా ముగిసింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు మిల్లర్లపై ఆర్‌ఆర్ యాక్ట్ ,క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం.

 నిత్యానందం,ఇన్‌చార్జీ జిల్లా పౌరసరఫరాల అధికారి, కామారెడ్డి

ముగిసిన ధాన్యం కొనుగోళ్లు

  1. 9 లక్షల మంది రైతులకు రూ.10,547 కోట్ల చెల్లింపు
  2. బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర రావడంతో తగ్గిన సేకరణ

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ఈ సీజన్‌లో వరి ధాన్యం కొనుగోళ్ళు ముగిశాయి. 2023 సీజన్‌లోని యాసంగి (రబీ)లో రాష్ట్రంలోని రైతాంగం పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన రైతులకు అంతేవేగంగా మూడు రోజుల్లోనే డబ్బులను చెల్లించినట్టుగా ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. దాదాపు 9 లక్షల మంది రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి.. సుమారు రూ.10,547 కోట్లను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

మూడు రోజుల్లోనే..

గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈసారి రైతులు డబ్బుల కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండవద్దని సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ ధాన్యం అమ్మిన రైతులందరికీ మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించినట్టు ప్రభుత్వ వర్గా లు పేర్కొంటున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలనూ ముందుగానే ప్రారంభించింది. ఏప్రిల్‌లో కాకుండా రెండు వారాలు ముందు గానే మార్చి 25 తేదీ నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సివిల్ సప్లు శాఖ అధ్వర్యంలో ప్రారంభించారు. ఈ రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. గతేడాది ఇదే సీజన్‌లో 6,889 సెంటర్లు మాత్రమే తెరవడం గమనార్హం. జూన్ 30 వరకు రబీ ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. 

48 లక్షల టన్నులు..

వాస్తవానికి ఈ ఏడాది 75.40 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సివిల్ సప్లు విభాగం మొదట్లో అంచనా వేసింది. అయితే ధాన్యం కొనుగోళ్లు ముగిసే సరికి 48 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే వచ్చిందని సివిల్ సప్లు శాఖ పేర్కొంది. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో కనీస మద్ధతు ధర (ఎంఎస్‌పీ) కంటే ఎక్కువ ధర రావడం, ప్రైవేటు వ్యాపారులు పోటీపడి ఎక్కువ ధరకు కొనుగోలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈదురుగాలులు, అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా సివిల్ సప్లు విభాగం పక్కాగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశారు.