- వీధి కుక్కలతో భయాందోళనలు
- ప్రాణాలు కోల్పోతున్న చిన్నారులు
- పదేళ్లలో 3.60 లక్షల ఫిర్యాదులు
- 3 లక్షలకు పైగానే కుక్క కాటు బాధితులు
- 7 లక్షల వీధి కుక్కలకు స్టెరిలైజేషన్
- ఫిర్యాదులతో తలలు పట్టుకుంటున్న అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 14 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ అధికమవుతున్నది. రోడ్లపై గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు ప్రజలపై దాడి చేస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. దీంతో కాలనీల ప్రజలు, చిన్నారులు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. వీధి కుక్కల దాడిలో చిన్నారులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. ప్రతి నెలా వేలాది మంది కుక్క కాటుకు గురవుతున్నారు.
ఈ నెల 6న జీహెచ్‌ఎంసీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఓ కార్పొరేటర్ నగరంలో కుక్కల నియంత్రణపై వేసిన ప్రశ్న ప్రధానమైన చర్చకు అనుమతి వచ్చిందంటే కుక్కల బెడద తీవ్రత ఎంతటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కల సంతాన నియంత్రణపై చర్య లు ఎలా ఉన్నా.. పొంచి ఉన్న ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యచరణ లేకపోవడం తో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులతో అధికారులు తలలు పట్టుకుం టున్నారు.
30 సర్కిళ్లకు వైద్యులు 11 మందే..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 6 జోన్లు, 30 సర్కి ళ్ల వ్యాప్తంగా వెటర్నరీ విభాగం ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది పనిచేస్తున్నారు. 30 సర్కిళ్లలో ఒక్కో వెటర్నరీ డాక్టర్ ఉండాలి. కానీ ప్రస్తుతం 11 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక్కో డాక్టర్ 5 సర్కిళ్లు.. కొందరు 4, మరికొందరు 3, 2 సర్కిళ్ల బాధ్యతలు చూస్తున్నారు. గ్రేటర్‌లో 5 జం తు సంరక్షణ కేంద్రాలు ఉండగా, 6 షెల్టర్ మేనేజర్లు, 22 మంది పారా వెటర్నరీ వైద్యు లు, 362 మంది వెటర్నరీ వర్కర్స్ ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్నారు.
వీధి కుక్కలను పట్టుకోవడానికి 30 సొంత వాహనాలు ఉండగా, మరో 20 అద్దె వాహనాలను జీహెచ్‌ఎంసీ వినియోగిస్తున్నది. వైద్యులుగా పనిచేస్తున్న వారంతా అత్యధికంగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న వారే. వీరి డిప్యూ టేషన్ పీరియడ్ పూర్తికాగానే తమ సొంత శాఖకు తిరిగి వెళ్తున్నారు. గ్రేటర్‌లో వెటర్నరీ సెక్షన్‌లో పనిచేసేందుకు సిబ్బంది కరవు తున్నారు. దీంతో సరిపడా సిబ్బంది లేని కారణంగానే వీధి కుక్కుల నియంత్రణలో ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదంటూ అధికారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కుక్కల నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి కొత్త నియామకాలతో పాటు ప్రత్యేక చర్యలను ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు.
3 లక్షల కుక్కకాటు బాధితులు
గ్రేటర్ వ్యాప్తంగా గత పదేళ్లలో కుక్కల బెడదపై 3 లక్షల 60 వేల 469 ఫిర్యాదులు అందినట్టు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వీధి కుక్కలు, పెంపుడు కుక్కలు, పిల్లులు, కోతులు వంటి జంతువుల కాటుకు 3 లక్షల 36 వేల 67 మంది గురైనట్టు నారాయణగూడ ఐపీఎం నివేదిక తెలియ జేస్తున్నది. అంతే కాకుండా 8 మంది చిన్నారులు వీధి కుక్కల బారిన పడి చనిపో యారు. కుక్కల సంతాన నియంత్రణతో పాటు రేబిస్ వ్యాధి సోకకుండా 7.21 లక్షల వీధి కుక్కలకు స్టెరిలైజ్ టీకాలు వేశారు.
ఈ మొత్తానికి జీహెచ్‌ఎంసీ ఏటా రూ.11.5 కోట్లను ఖర్చు చేస్తున్నది. అయితే, కుక్కల నియంత్రణకు సంబంధించిన అంశంపై పలువురు ఎన్‌జీవో సంస్థలకు సైతం స్టెరిలైజ్ చేసే అధికారాన్ని ప్రభుత్వం కల్పిం చింది. వీధి కుక్కల సంతాన నియంత్రణకు జీహెచ్‌ఎంసీ అధికారులు స్టెరిలైజేషన్ కోసం ప్రతిరోజూ 250 వీధి కుక్కలను పట్టుకుంటున్నారు. ఎన్‌జీవో సంస్థల ద్వారా మరో 200లకు పైగానే స్టెరిలైజ్ చేస్తున్నారు. నగరంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్లమ్ లెవల్ ఫెడరేషన్లు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) రూల్స్‌పై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
తలనొప్పిగా మారుతున్న ఫిర్యాదులు
ఎనిమల్ బర్త్ కంట్రోల్ (2023) మార్గదర్శకాల ప్రకారం కుక్కల సంతాన నియంత్రణకు మాత్రమే అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అంతే కానీ, పట్టుకున్న కుక్కలను నిర్మూలించే అధికారం లేదు. స్టెరిలైజ్ కోసం కుక్కలను ఎక్కడి నుంచి తీసుకెళ్లారో తిరిగి అక్కడే వదిలేయాల్సి ఉంటుంది. అయితే, కుక్కల బెడదపై చర్యలకు మై జీహెచ్‌ఎంసీ యాప్, ఎక్స్ వేదిక, జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్‌కు ప్రతిరోజూ వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతాయి. అంతే కాకుండా వీధి కుక్కలకు ప్రతిరోజూ ఆహారం అందించే డాగ్ లవర్స్‌కు ఫీడింగ్ సమయంలో ఏదైనా కుక్క కన్పించకపోతే చేస్తున్న ఫిర్యాదులతో అధికారులకు తలనొప్పిగా మారుతున్నది. ఈ తరహా ఫిర్యాదులు గ్రేటర్‌లో ప్రతినెలా వందల సంఖ్యలో వస్తున్నాయి.