calender_icon.png 24 November, 2024 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహావిజయం వెనుక..

24-11-2024 03:16:52 AM

ప్రత్యక్ష నగదు బదిలీతో మహిళలకు అండ

  1. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన
  2. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి నేర్పిన పాఠాలు
  3. మహారాష్ట్రలో మహాయుతి విజయానికి దోహదపడ్డ కారణాలు

న్యూఢిల్లీ, నవంబర్ 23: మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలోని 288 స్థానాలకు గానూ 235 స్థానాల్లో గెలిచి సత్తా చాటుకుంది. ఈ నేపథ్యంలో మహాయుతి కూటమి విజయంలో అనేక అంశాలు కీలకపాత్ర పోషించాయి. 2019 అసెం బ్లీ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్రంలో పాలనాపరమైన అస్థిరత్వం నెలకొంది.

2019 నుంచి 2024 వరకు అయిదేండ్ల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులు, అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించారు. దీంతో ఈసారి స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకే ప్రజలు మొగ్గుచూపారు. రాష్ట్రం లో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ప్రజల నాడిని పట్టి విజయం సొంతం చేసుకుంది. మరాఠాలకు రిజర్వేషన్ల కల్పన, మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకం లాంటివి కూటమి విజయంలో కీలకపాత్ర పోషించాయి.

ఓటమి నేర్పిన గుణపాఠం

2024 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి ఓటమిని మూటగట్టుకుంది. మొత్తం 48 స్థానాలున్న రాష్ట్రంలో మహావికాస్ అఘాడీ 30 సీట్లు గెలుచుకుంది. 13 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. కాగా 2019లో 23 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ 9 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

శివసేన (షిండేవర్గం)కు 7 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం ఒకే చోట విజయం సాధించింది. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్న మహాయుతి కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రత్యక్ష ప్రభావం - మాజీ లడ్‌కీ బహిన్ 

పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల నాడిని పసిగట్టిన మహాయుతి కూటమి రాష్ట్రంలో 2024, జూన్‌లో అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా 18 ఏండ్లు నిండిన మహిళలకు నెలకు మాజీ లడ్‌కీ బహిన్ పేరిట రూ.1,500 చొప్పున పంపిణీ చేసింది.

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రెండు కోట్ల ముప్పు లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందారు. ఈ మొత్తాన్ని రూ.2,100 కు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీగా పేర్కొంది. దీంతో ఆకర్షితు లైన మహిళా ఓటర్లు కమలానికి పట్టంగట్టారు.

మరాఠా రిజర్వేషన్లు

మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉంటారు. అక్కడి గ్రామీణ ప్రాంతాల్లోనూ హట్కర్లు తమదైన రాజకీయ ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో మరాఠా సమాజానికి విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మహాయుతి హామీ ఇచ్చింది. దీంతో వీరి ఓట్లు కూడా గంపాగుత్తాగా కమలానికి పడ్డట్లు తెలుస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు

గ్రామీణ ఓటర్లపై అధికార ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించింది. రైతులు పండించిన పంటలను మార్కెట్లకు తరలించేందుకు వీలుగా 45 వేల కిలోమీటర్ల కొత్త రహదారులను వేసింది. దీంతో రోడ్ కనెక్టివిటీ పెరిగి రైతులు మహాయుతికి ఆకర్షితులయ్యారు.

అదేవిధంగా రాష్ట్రంలో మౌలిక వసతులను కల్పించేందుకు 2024-25 బడ్జెట్‌లో 12.7 శాతం నిధులను కేటాయించారు. 2019-20 లో ఇది 9.6 శాతంగా ఉంది. అంగన్‌వాడీ, ఆశా వర్కర్ల జీతాలను నెలకు రూ.15 వేలకు పెంచడం, వృత్తి విద్యను అభ్యసిస్తున్న పదిలక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించడం లాంటి అనేక అంశాలు కలిసొచ్చాయి.

మళ్లీ తమకు అధికారం కట్టబెడితే 25 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో నిరుద్యోగ యువత సైతం అధికార పార్టీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు నిత్యవసర తగ్గిస్తామని ప్రకటించడంతో మధ్య తరగతి ప్రజలు సైతం కమలం పక్షాన నిలిచారు.

ఆటోవాలా టూ సీఎం..

* సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఏక్‌నాథ్ షిండే.. చదువును మధ్యలోనే ఆపి ఆటో, లారీ డ్రైవర్‌గా, బీర్లు తయారు చేసే కంపెనీలోనూ పనిచేశారు. శివసేన ఫైర్‌బ్రాండ్ నేత దివంగత ఆనంద్ దిఘే ఆశీస్సులతో ౧౯౯౭లో థానే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా షిండే రాజకీయ ప్రస్థానం మొదలైంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన ఏక్‌నాథ్.. సీఎం స్థాయికి ఎదిగారు. కాగా షిండే శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌కు ప్రియ శిష్యుడు.

* మహారాష్ట్రలో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన ఉద్దవ్ ఠాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాలుగా చీలిన విషయం తెలిసిందే. ౨౦౨౨ జూన్‌లో పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి బీజేపీతో కలిసి మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు.

* ఉద్దవ్ వర్గం కాంగ్రెస్ పార్టీతో కలిసి మహావికాస్ అఘాడీ కూటమిలో కొనసాగుతున్నాయి. శివసేన పార్టీ ఎవరిదని చీలిక వర్గాలు పిటిషన్లు వేయగా.. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు. ఈసీ కూడా ఏక్‌నాథ్ షిండేదే అసలైన శివసేన అని గుర్తించడంతోపాటు ధను స్సు, బాణం గుర్తును కూడా ఆయన వర్గానికే కేటాయించింది.

* శనివారం వెలువడిన మహారాష్ట్ర ఫలితాల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నది. మరోసారి రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకుని ఎన్డీయే శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. కాగా బీజేపీ కేంద్ర పరిశీలకులు కూటమి భాగస్వామ్య పక్షాలతో భేటి కానున్నారు. నవంబర్ ౨౬లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది.