calender_icon.png 15 November, 2024 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ మౌనం వెనుక..?

14-11-2024 12:00:00 AM

-డా. తిరుణహరి శేషు 

కేసిఆర్ పార్టీపెట్టిన తరువాత 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో రాజకీయంగా గెలుపు ఓటములు ఎదురైనా నిలదొక్కుకున్నారు. అలాంటి నాయకుడు ఒక్క ఓటమితో మౌనం దాల్చడం రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

తెలంగాణ రాష్ట్ర శాసనసభకు మూడోసారి జరిగిన ఎన్నికలలో ఊహించని ఓటమిని చవిచూసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్  పరాజయ భారం నుండి బయటపడ లేకపోతున్నారా అనే సందేహాలు రాష్ట్ర ప్రజల మెదడులను తొలిచి వేస్తున్నాయి. దేశంలోనే ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ఓటమి తరువాత మౌనం దాల్చటం ఆశ్చర్యం కలిగిస్తోంది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా, మరో ఒకటి, రెండు సందర్భాలలో తప్ప రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోవడం, ప్రధాన ప్రతిపక్ష నేత అయినా ఒకే ఒక పర్యాయం అసెంబ్లీకి హాజరవటం,దాదాపు పదకొండు నెలలుగా ఫామ్‌హౌస్‌కే పరిమితమవుటం వల్ల రాజకీయ వర్గాలలో అనేక రకాల చర్చలకు ఆస్కారం ఏర్పడుతోంది.

పోటీ చేసిన మొదటి ఎన్నికలోనే స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి ఎదురైనా రెండు సంవత్సరాల తరువాత మళ్లీ  జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయం సాధించి తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్రమంత్రిగా, వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసిఆర్ పార్టీపెట్టిన తరువాత 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో రాజకీయంగా గెలుపు ఓటములు ఎదురైనా నిలదొక్కుకున్నారు.

అలాంటి నాయ కుడు ఒక్క ఓటమితో మౌనం దాల్చడం రాజకీయ పండితులను, నాయకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోందనే చెప్పాలి. శాసనసభ ఎన్నికలలో ఓటమి తరువాత కేసీఆర్ ఎందుకు మౌనం వహించారనే ప్రశ్నలకు ఎక్కడా సమాధానం దొరకని స్థితి. ఈ మౌనం వెనుక దాగిన వ్యూహం ఏమిటనే ప్రశ్న రాజకీయ యవనికపై             ఉదయిస్తుంది.

మౌనం ఎందుకు? 

శాసనసభ ఎన్నికలలో, ఆ తర్వాత లోక్ సభ ఎన్నికలలో  ఎన్నికల్లో ఎదురైన దారుణ ఓటముల తర్వాత పార్టీలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పార్టీని వీడటం రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణ రాజకీయాలను ఒకరకంగా శాసిం చిన కేసీఆర్‌ను ఆలోచనలో పడేసిందనే చెప్పాలి. మరొకవైపు పది సంవత్సరాల పాలనలో జరిగిన తప్పిదాలపై, కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాలపై జరుగుతున్న విచారణలు కేసీఆర్‌కు ఇబ్బందిగా మారిన నేపథ్యంలోమౌనం దాల్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సమీప భవి ష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నా కీలకమైన ఎన్నికలు లేకపోవటం,  అధికారంలోకి వచ్చిన పార్టీకి ఎదురు వెళ్లకుండా కొంత సమయం ఇవ్వడం, తప్పిదాలు చేసే దాకా ఓపికతో ఎదురు చూడటం రాజకీయాలలో సర్వసాధారణమే కానీ అధికార పార్టీ నుండి తనపై వస్తున్న ఆరోపణలకు గాని, ప్రస్తుత ప్రభుత్వ విధానా లపై గాని మాట్లాడక పోవటం, విమర్శలు చేయకపోవటం వ్యూహాత్మక మౌనమా? మరేదైనా కారణమా? అనే ప్రశ్నలకు సమాధానం లేదనే చెప్పాలి.

ఒక రాజకీయ నాయకుడి జీవితంలో సర్వసాధా రణంగా ఎదురయ్యే పరిణామాలే  కేసీఆర్‌కు ఎదురవుతున్నాయి కానీ ఈ పరిణా మాలకే ఆయన ఈ స్థాయిలో మౌనం దాల్చటం ఆశ్చర్యమే.

 పార్టీ భవిష్యత్తు ఏమిటి? 

23 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సమితి(ఙప్పుడు బీఆర్‌ఎస్)ని తన కనుసైగలతో అన్నీ తానై నడిపిన కేసీఆర్ మౌనం పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తోంది. శాసనసభ ఎన్నికలలో ఓటమి తరువాత అటు అసెంబ్లీలో, ఇటు క్షేత్రస్థాయిలోనూ కేటీఆర్ ,హరీష్ రావులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నా కేసీఆర్ లేని లోటుని పూడ్చలేకపోతున్నారనే అభిప్రాయాలు కలుగుతున్నాయి. శాసన సభ్యులుగా, మంత్రులుగా పనిచేసిన అనుభవం ఇద్దరికీ ఉన్నప్పటికీ అధికార పార్టీని దీటుగా ఎదుర్కోలేకపోతున్నారనే చెప్పాలి.

వ్యక్తి కేంద్రంగా నడిచే ప్రాంతీయ పార్టీలకు ఉండే సమస్యలే బీఆర్‌ఎస్‌కు ఎదురవుతున్నాయి. సమాజ్ వాదీ పార్టీ పగ్గాలు ములాయం సింగ్ చేతిలో, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ పగ్గాలు లాలూ ప్రసాద్ యాదవ్ చేతిలో ఉన్నంతకాలం అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్‌ల పరిస్థితి ఎలా ఉందో బీఆర్‌ఎస్ పగ్గాలు కేసీఆర్ చేతిలో ఉన్నంతకాలం కూడా కేటీఆర్ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు.

ఉద్యమ కాలంలో ఉద్యమ ఆకాంక్ష పార్టీకి బలంగా ఉండేది కానీ నేడు ప్రతిపక్ష పాత్రలో పార్టీ ఇమడలేక బలహీనపడుతుంది. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో 47 శాతం ఓట్లను సాధించిన పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల నాటికి 17 శాతం ఓట్లకు పరిమితం కావడం ఆ పార్టీ బలహీనతకు అద్దం పడుతోంది. 2023 శాసనసభ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌కు దారుణమైన ఓటమి ఏమి ఎదురు కాలేదు.

ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన శాసనసభా స్థానాలు మాత్రమే దక్కలేదు. బీఆర్ ఎస్ మరొక పది స్థానాలలో విజయం సాధించి ఉంటే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మరో విధంగా ఉండేవి. బిఆర్ ఎస్‌కు బలమైన ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పార్టీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోవడం ఆ పార్టీని అధికారానికి దూరం చేసింది. శాసనసభ ఎన్నిక లలో ఓటమి తర్వాత వరుసగా జరుగుతున్న పరిణామాలు బీఆర్‌ఎస్‌ను మరింత గా బలహీనపరిస్తే, కేసీఆర్ మౌనం పార్టీ శ్రేణులలో ధైర్యాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.

రెండు దశాబ్దాలకు పైగా రాజకీ యంగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొన్న కేసీఆర్ భవిష్యత్తులో అధికారంలో ఉన్న ఆ పార్టీని, బలం పెంచుకున్న మరొక జాతీ య పార్టీ బిజెపిని తట్టుకొని నిలబడి మళ్లీ అధికారంలోకి రావడం అంత తేలికైన విషయం కాదు. ఓటమి ఎదురైనా బలం పెంచుకొని ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, తమిళనాడులో డీఎంకే లాగా అధికారంలోకి వస్తారా లేదా హర్యానాలో ఐఎన్ ఎల్ డీ, పంజాబ్ లో శిరోమణి ఆకాలీదళ్ గా బలహీన పడతారా అనేది కేసీఆర్ వ్యూహాల పైన, క్షేత్రస్థాయిలో పార్టీ పోరాటంపైన ఆధారపడి ఉంటుంది.

ప్రతిపక్ష నేతగా బాధ్యత లేదా! 

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు పర్యాయాలు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఒకే ఒక్క రోజు సభకు హాజరై శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపో యారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను శాసనసభలో ఎండగట్టాల్సిన నాయ కుడే సభకు గైరు హాజరవ్వటం ఎంతవరకు సభా సంప్రదాయం అనే విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రిగా సెక్రటేరియట్‌కు రాని కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోవటంలో వింత ఏముంది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటరీ సంప్రదాయాలలో చట్టసభకు ఉండే గౌరవం, ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడటానికి బలమైన వేదిక కాబట్టి అలాంటి సభకే కేసీఆర్ రాకపోవటాన్ని బీఆర్‌ఎస్ పార్టీ సమర్థించుకోజా లదు. ప్రభుత్వం పైన సభలో కానీ ప్రజా క్షేత్రంలో కాని కేటీఆర్, హరీష్ రావులు ఎంత పోరాడినా కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి కేసీఆర్ మౌనం పార్టీకి నష్టం. అలాగే ప్రతిపక్ష నేతగా ఆయన వైఫల్యంగా ప్రజలు భావించే అవకాశం కూడా లేకపోలేదు.

తక్కువ అంచనా వేయలేం 

40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్‌ని తక్కువ అంచనా వేయలేం. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఖాళీగా కూర్చున్నారని భావిస్తే అది రాజకీయ అపరిపక్వత గానే భావించాలి ఇప్పటికీ తెలంగాణలో బీఆర్‌ఎస్ బలమైన పార్టీనే. ఏ కూటమిలో భాగస్వామ్యం కాని అధికార ప్రాంతీయ పార్టీలైన బీజేడీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ,బీఆర్‌ఎస్‌లకు లోక్ సభ ఎన్నికలలో, శాసనసభ ఎన్నికలలో దారుణ పరాజయమే ఎదురైంది.

అయితే ప్రభుత్వంపైన ప్రజలలో ఉన్న అసంతృప్తి కాస్త వ్యతిరేకతగా మారేదాకా, ప్రభుత్వంపై పోరాడటానికి బలమైన అస్త్రం దొరికేదాకా వేచి ఉండాలనేదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. ఏది ఏమైనా సమకాలీన రాజకీ యాలలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజ య్, కిషన్ రెడ్డి లాంటి ఈ తరం రాజకీయ నాయకులతో పోటీపడి పూర్వ వైభవం సాధించగలరా లేక కేటీఆర్, హరీష్ రావుల తరానికి బాధ్యతలు అప్పజెప్పి తెరవెనక రాజకీయ వ్యూహాలతో రాష్ట్ర రాజకీ యాలలో మరి కొంతకాలం మనగలుగుతారా కాలమే నిర్ణయించాలి. ఉద్యమకా రునిగా ప్రజామోదం పొందిన కేసీఆర్ పాలకుడిగా అదే ప్రజల చేత ఓడించబడటం రాజకీయ వైచిత్రమే. 

-వ్యాసకర్త సెల్: 9885364877