calender_icon.png 26 October, 2024 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగస్టులో ఆరంభం..

04-08-2024 12:54:40 AM

ఆగస్టు వచ్చింది.. ఆషాడం పూర్తి కానుంది. రానున్న శ్రావణంలో శుభారంభాలెన్నో జరుగనున్నాయి. ఆ ఆరంభాల సందడి చిత్రసీమలోనూ నెలకోనున్నది. ప్రారంభోత్సవం అనగానే సినీ జనాలకు గుర్తుకొచ్చేది కొత్త సినిమాల పూజా కార్యక్రమాలే. ఔను, ఈ నెలలో కొన్ని చిత్రాలు ప్రారంభోత్సవం జరుపుకొనున్నాయి. ఆసక్తికర కథలు, కలయికలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆ సినిమాలపై ఓ లుక్కేస్తే...

ఆరంభానికి ఆగస్టు మాసపు ముహూర్తాలే సరైనవని భావించిన సినిమాల్లో ఇప్పటికే కొబ్బరికాయ కొట్టి చిత్రీకరణ షురూ చేయాల్సినవి కొన్నయితే, ఇప్పటిదాకా ఎలాంటి పూజా కార్యక్ర మాల జోలికీ వెళ్లకుండా, ఆగస్టు నాటికి కెమెరా ముందుకు వస్తున్నామంటూ కొన్నాళ్లుగా ఊరిస్తున్న చిత్రాలు ఇంకొన్ని.  

ప్రభాస్- హను రాఘవపూడి

ముందుగా చెప్పుకోవాల్సింది ప్రభాస్ సినిమా గురించే. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వస్తోన్న ప్రభాస్, ఎవ్వరూ ఊహించని రీతిలో మారుతి, హను రాఘవపూడిలతో జోడీ కట్టారు. ‘కల్కి’తో మరో విజయ కిరీటం ధరించిన ‘రాజాసాబ్’, ఓ వైపు మారుతి సినిమా చేస్తూనే హను సినిమానీ సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నారు. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం రజాకార్ల కాలం నాటి కథగా తెలుస్తోంది. ‘సీతారామం’ తర్వాత హను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్లాస్ టచ్ ఉన్న మాస్ మూవీ అని వినికిడి.

స్క్రిప్ట్ విషయమై కొన్ని నెలల పాటు తన టీమ్‌తో కసరత్తులు జరిపిన దర్శకుడు, ఇప్పటికే ఈ సినిమాకి కావాల్సిన సెట్స్‌నూ సిద్ధం చేయించారట. హీరోయిన్‌గా పలువురి పేర్లు తెరపైకి వస్తుండగా.. తాజాగా మృణాల్ పేరు అందులో చేరింది. హను దర్శకత్వం వహించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘పడిపడి లేచే మనసు’, ‘సీతారామం’ చిత్రాలకు స్వరాలందించిన విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకీ సంగీతమం దించనున్నారు. ఈ నెల 17న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానున్న ఈ సినిమా చిత్రీకరణ ఆగస్టు నెలాఖరున తమిళనాడులో జరుగనున్న తొలి షెడ్యూల్‌తో ఆరంభం కానున్నట్టు సమాచారం.

ఆర్‌సీ 16 : బరిలో దిగడమే తరువాయి

బుచ్చిబాబు చరణ్ చిత్ర ప్రారంభోత్సవం జరిగి మూడు నెలలు కావస్తుండగా, వీరి కలయికలో సినిమా ప్రకటించి ఏడాదిన్నర దాటింది. శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు 2’ సినిమా విడుదల, అప్పటికి మిగిలి ఉన్న ‘గేమ్ చేంజర్’ చిత్రీకరణ వలన ఈ సినిమా ఇంతకాలం ఆలస్యమవుతూ వచ్చింది. తర్వాత చరణ్ ఆ సినిమా నుండి బయటపడటంతో ఆర్‌సీ 16 సెట్స్ పైకి వెళ్ళటమే తరువాయి అన్నట్టుంది. శ్రీకాకుళం నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో ఆయన ‘రంగస్థలం’ మాదిరి పల్లెటూరి వ్యక్తిగా కనడనున్నారు.

దీనికి సంబంధించి రామ్ చరణ్ మేకోవర్ కోసం కాచుకుని ఉన్నారు దర్శకుడు బుచ్చిబాబు. ప్రస్తుతం చరణ్ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తిరిగొచ్చాక చరణ్ లుక్ ఓకే అనుకుంటే.. ఇదే నెలలో సినిమా పట్టాలెక్కనుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించనున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయిక. రత్నవేలు ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్న ఈ సినిమా కోసం స్వర మాంత్రికుడు రెహమాన్ ఇప్పటికే మూడు పాటలను సిద్ధం చేశారట.

కొత్త సినిమా మొదలెట్టనున్న రానా 

కథనాయకుడిగానే కొనసాగాలనుకోక నటుడిగా విభిన్నమైన కథలు, పాత్రలతో సాగుతున్న రానా చివరిగా ‘విరాటపర్వం’ సినిమాలో హీరోగా నటించారు. తర్వాత ‘హిరణ్యకశిప’ సహా పలు సినిమాలు ప్రస్తావనకొచ్చినా కార్యరూపం దాల్చకుండా ఉండిపోయా యి. ఈ క్రమంలో నటుడిగా ‘వేట్టయాన్’ సినిమాలో కీలక పాత్ర పోషించిన రానా, కథానాయకుడిగా ఈ నెలలో కొత్త సినిమా ఆరంభించనున్నారని సమాచారం. ఈ మేరకు కిషోర్ అనే దర్శకుడితే ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయట. ఆర్కా మీడియా సంస్థలో ఈ సినిమా తెరకెక్కనుంది. అధికారిక ప్రకటనతోపాటు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానుండగా.. వెను వెంటనే చిత్రీకరణ పనులు ఆరంభం కానున్నాయి. సుమారు రెండేళ్ళ తర్వాత హీరోగా రానా నటించనున్న ఈ సినిమాలో.. ఆయన్ను అంతలా కట్టిపడేసిన కథేంటన్నది ఆసక్తికరంగా మారిందిప్పుడు. 

మొదలంటూ మురిపించినవి..

ఎప్పటి నుండో మురిపిస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్  ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ‘సలార్ 2’ కారణంగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న ఈ సినిమాపై కొంత అనిశ్చితి ఏర్పడినా.. ‘దేవర’ సినిమా చిత్రీకరణ పూర్తి కానుండటంతో ఎన్టీఆర్‌నీల్ సినిమా చిత్రీకరణ ఆగస్టులో ఆరంభం కానుందని కథనాలు వెలువడ్డాయి. ఇదే స్థాయిలో అభిమానులు ఆశిస్తున్న మరో కలయిక బాలయ్య  బోయపాటిది. దీనిపై కొద్ది రోజుల క్రితం దర్శకుడు బోయపాటి శ్రీను స్పందిస్తూ “స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.

బాలయ్య ఎన్నికల వ్యవహారాలు పూర్తయితే ఆగస్టు నాటికి మొదలయ్యే అవకాశం” ఉందన్నారు. ఇప్పటికైతే ఆ మాట అలానే ఉంది. ఈ కోవలోనివే నాని ఓదెల, విజయ్ దేవర కొండ రవికిరణ్ సినిమాలు కూడా. ఈ సమయానికి కెమెరాలోకి ఎక్కాల్సిన ఈ సినిమాలు ఇంకాస్త ఆలస్యమయ్యేలానే ఉన్నాయి. వీటన్నిటినీ మించి ఆత్రంగా సినిమా తొలి ఆట కోసం చూసినట్టు.. తొలి షాట్ ఎప్పుడు పడుతుందా అన్న సినిమా ఒకటుంది. అదే రాజమౌళి  మహేశ్ బాబుల సినిమా. మహేశ్ పుట్టిన రోజైన ఆగస్టు 9వ తేదీనైనా ఈ సినిమాకు సంబంధించిన కబురు వినబడకపోదా అన్నది అభిమానుల ఆశ.