calender_icon.png 31 January, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ కార్పొరేటర్ల భిక్షాటన

31-01-2025 01:09:20 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 30 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని బీజేపీ కార్పొరేటర్లు గురువారం వినూత్నమైన పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. బల్దియా బడ్జెట్ ఖాళీ కావడమే కాకుండా, పాలకమండలి నిర్వాకంతో రూ. 6వేల కోట్ల అప్పుల్లో మునిగిపోయిందని బీజేపీ కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట రహదారిపై భిక్షాటన చేశారు.

మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్‌కుమార్, సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి, మూసాపేట కార్పొరేటర్ మహేందర్, కొత్తపేట కార్పొరేటర్ పవన్ ఈ నిరసనలో పాల్గొన్నారు. మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలో నిధులు లేకపోవడంతో అభివృద్ధికుంటుపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది బడ్జెట్‌లో రూ.1200 కోట్లను కేటాయించినప్పటికీ, నేటికి ఒక్క రూపాయి రాలేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన స్టేట్ ఫైనాన్స్ నిధులతో పాటు ప్రభుత్వ ఆస్తి పన్ను, మోటార్ ట్యాక్స్, గ్రీన్స్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్ నిధులు కూడా ఒక్క రూపాయి రాకపోవడం శోచనీయం అన్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లకు సైతం నిధులు విడుల చేయలేని స్థితిలో ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జీహెచ్‌ఎంసీకి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.