calender_icon.png 11 February, 2025 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15 శాతం పెరగనున్న బీర్ల ధర

11-02-2025 12:47:07 AM

  1. రేట్ల సవరణకు ప్రభుత్వం ఆమోదం
  2. నేటి నుంచే అమల్లోకి 

హైదరాబాద్ , ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): బీర్ల ధరలు 15 శాతం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. బీర్ల ధరల సవరణ కోసం ప్రభుత్వం నియమించిన విశ్రాంత న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన బీర్ల ధరల నిర్ణయ కమిటీ 15 శాతం పెంచాలని సిఫారసు చేసింది.

కమిటీ సిఫారసు మేరకు సరఫరాదారులకు 15 శాతం ధర పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది. ధరల సవరణతో ప్రస్తుతం ఉన్న బీర్ల ఎమ్మార్పీ 15 శాతం పెరగనుంది. అయితే ముడి సరుకు ధరలు పెరగడంతో బీర్ల తయారీ భారం మారిందని, ధరలను సవరించాలని కింగ్ ఫిషర్ బీర్ల తయారీ కంపెనీ యూబీఎల్ గతంలో పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తమ కంపెనీ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. బీర్ల ధరలు పెంచడం వల్ల ప్రజలపై భారం పడుతుందని, ధరలు పెంచడానికి వీలులేదని సర్కారు కూడా స్పష్టంచేసింది.

దీంతో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిచిపోతుందని ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం, యూబీఎల్ కంపెనీ మధ్య చర్చలు జరగడం, ధరల కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకుందామని హామీ ఇవ్వడంతో యథావిధిగా బీర్ల సరఫరా కొనసాగుతోంది.