11-02-2025 04:15:32 PM
15 శాతం ధరల పెంపుతో మద్యం దుకాణాల్లో బీర్లకు కృత్రిమ కొరత
సిండికేటుగా మారి మద్యం ప్రియుల జేబులకు చిల్లులు
పట్టించుకోని ఆబ్కారీ శాఖ
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలోని మద్యం దుకాణాల్లో సాధారణ బీర్లతో పాటు కింగ్ ఫిషర్ బీర్ నో స్టాక్ అంటూ యజమానులు బీర్లకు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీర్లపైన 15% ధరలు పెంచిన నేపథ్యంలో అంతకుముందే తక్కువ ధరకు కొనుగోలు చేసిన బీర్లను స్టోరేజ్ చేసుకొని నో స్టాక్ అంటూ కృత్రిమ కోరత సృష్టిస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. జిల్లాలోని మద్యం దుకాణా దారులంతా సిండికేట్ గా మారి బీర్ తాగే మద్యం ప్రియులకు కిక్కిచ్చే షాక్ ఇస్తున్నారు.
అసలే ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బీర్ వాడకం మరింత పెరిగిన నేపథ్యంలో అదును చూసి మద్యం దుకాణదారులు కూడా తమ కక్కుర్తి బుద్ధుని ప్రదర్శిస్తున్నారని మద్యం ప్రియులు మండి పడుతున్నారు. సోమవారం రాత్రి నుంచి బీర్ల ధరలు 15% పెంచిన నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి మద్యం దుకాణాలు మూసేశారు. మరికొన్ని దుకాణాల్లో వెనకనుంచి బెల్టు షాపుల యజమానులకు మాత్రమే బీర్లను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులకు మద్యం ప్రియులు ఫిర్యాదు చేస్తున్న పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.