calender_icon.png 9 October, 2024 | 4:47 PM

ఆక్రమణల వల్లే

04-09-2024 01:09:03 AM

వరద కష్టాలు.. ఖమ్మంలో పువ్వాడ కబ్జాలు

మున్నేరువాగుకు రిటైనింగ్ వాల్

  1. నిర్మాణంతో శాశ్వత పరిష్కారం 
  2. జిల్లాల్లోనూ హైదరాబాద్ తరహా హైడ్రా వ్యవస్థ
  3. చెరువులు, నీటి వనరులు ఆక్రమిస్తే సహించం
  4. ఆక్రమణదారులు ఎంతటివారైనా ఉపేక్షించం
  5. ఖమ్మంలో బీఆర్‌ఎస్ నేతల ఆక్రమణలు
  6. హరీశ్‌రావు కోరితే స్వయంగా వచ్చి చూపిస్తా
  7. కేటీఆర్ అమెరికాలో, కేసీఆర్ పాంహౌస్‌లో
  8. లక్ష కోట్ల అక్రమార్జనలో రెండు వేల కోట్లు ఇవ్వొచ్చుగా? 
  9. ఖమ్మం, మానుకోటలో సీఎం రేవంత్‌రెడ్డి 
  10. రెండోరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
  11. బాధితులకు అండగా ఉంటాం

ఖమ్మం/మహబూబాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): గత పదేండ్లలో హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ చెరువులు, కుంటలు, నదులు, వాగులు ఆక్రమణకు గురయ్యాయని, అందుకే ప్రస్తుతం వరదల తీవ్రత అధికంగా ఉన్నదని ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఖమ్మంలో చెరువులు, నాలాలు, కాల్వల ఆక్రమణ వల్లే పట్టణంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చాయని, ఆక్రమణలు తొలగిస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండోరోజు మంగళవారం కూడా సీఎం పర్యటించారు. ఖమ్మంలో ఆయన విలేకరులతో చిట్‌చాట్ నిర్వహించారు. మహ బూబాద్ జిల్లాలో వరద బాధితులను పరామర్శించిన అనంతరం మాట్లాడారు. జిల్లాల్లో కూడా కట్టుదిట్టంగా సర్వే నిర్వహించి  ఆక్రమణల లెక్క తేలుస్తామని చెప్పారు. గతంలో తెలంగాణలో గొలుసుకట్టు చెరువులు ఉండేవని, అవి ప్రస్తుతం ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లాయని అన్నారు. 

అక్రమ సంపాదన నుంచి 2 వేల కోట్లయినా ఇవ్వొచ్చుగా?

ఖమ్మం నగరంలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు కొందరు చెరువులు, ఎన్‌ఎస్‌పీ భూములను ఆక్రమించి భారీ భవనాలు, ఆస్పత్రులు కట్టడం వల్లనే ప్రజలు వరదల పాలు కావాల్సి వచ్చిందని సీఎం ఆరోపించారు. హరీశ్‌రావుకు సత్తా ఉంటే, ప్రజలపై ప్రేమ ఉంటే ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అక్రమణలు తొలగించి, నిజాయితీ నిరూపించు కోవాలని డిమాండ్ చేశారు. ‘రమ్మంటే నేనే వచ్చి ఆక్రమణలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తా.. కూలగొట్టిస్తారా?’ అని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు.

కేటీఆర్ అమెరికాకు, కేసీఆర్ హైదరాబాద్‌లో ఫాంహౌస్‌కు పరిమితమయ్యారని, బీఆర్‌ఎస్ బాధ్యాయుత ప్రతిపక్షంగా వ్యవహ రించడం లేదని విమర్శించారు. వదలతో రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే బీఆర్‌ఎస్ నేతలు ఏమీ పట్టనట్లు ఉన్నారని ఆరోపించారు. ‘మీరు (బీఆర్‌ఎస్) అక్రమంగా సం పాదించిన లక్ష కోట్లలో నుంచి వరద బాధితులను ఆదుకునేందుకు కనీసం వెయ్యి కోట్లయినా పంచిపెట్టవచ్చు కదా?’ అని ప్రశ్నించారు. బీజేపీ నేత ఈటల రజేందర్‌కు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, రాష్ట్రంలో జరిగిన ప్రకృతి విలయతాండవా న్ని జాతీయ విపత్తుగా ప్రకటింపజేసి, రూ.5 వేల కోట్లయినా సాయం అందేలా చూడాలని సూచించారు.

సాయం చేయాలని ప్రధాని మోదీని కోరామని తెలిపారు. రూ.5,438 కోట్ల విపత్తు సాయం అందించాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. వరదలతో సర్వస్వం కోల్పోయిన ఖమ్మం ప్రజలకు తాత్కాలిక సాయంగా ప్రతి ఇంటికి రూ.10 వేలు ప్రకటించామని, పూర్తి నివేదిక అందిన తర్వాత సాయంపై పునఃపరిశీలన చేస్తామని సీఎం వెల్లడించారు. మున్నేరుకు ఇరువైపులా రూ.650 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్‌ను వచ్చే వానకాలం నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు.

అక్రమార్కుల భరతం పడుతాం

చెరువులు ఆక్రమించి ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్న వారు ఎంతటి పెద్ద స్థాయిలో ఉన్నా ఉపేక్షించబోమని సీఎం హెచ్చరించారు. జిల్లాలవారీగా ఆక్రమణకు గురైన చెరువులు, కుంటల నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం వరద 

ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో సుమారు 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, 680 మందికి పునరావాసం కల్పించినట్లు చెప్పారు. సీతారామ్‌తండాలో వరద సమయంలో ప్రజలకు అండగా నిలబడిన ఎస్సై నగేష్‌ను అభినందించారు. ఆకేరు వాగు వరద బారిన పడుతున్న మూడు తండాలను ఒకే ప్రాంతానికి తరలించి ఆదర్శ కాలనీ నిర్మించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఇప్పటికే ప్రధానికి లేఖ రాశామని, జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి రాష్ట్రానికి రావాలని ప్రధానమంత్రిని కోరినట్లు చెప్పారు. వరదతో చేరిన బురదను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని, లేకుంటే దోమలు విజృంభించి విషజ్వరాలు ప్రబలే ప్రమాదముందని హెచ్చరించారు. సహాయక చర్యల కోసం ఇతర ప్రాంతాల నుంచి అధికారులను రప్పించుకోవాలని సూచించారు. కూలిపోయిన విద్యుత్ లైన్లను తక్షణమే పునరుద్ధరించాలని ఆదేశించారు. వరద ప్రమాద ప్రాంతాలు, ప్రమాదానికి కారణాలు వాటిని ఎదుర్కొన్న తీరుపై బ్లూబుక్‌ను తయారు చేసుకొని కలెక్టరేట్లలో ఉంచాలని, భవిష్యత్‌లో అధికారులకు ఉపయోగకరంగా ఉంటాయని సూచించారు. 

హైడ్రా తరహాలో జిల్లాల్లో వ్యవస్థ

హైదరాబాద్‌లో చెరువు ఆక్రమణను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా తరహాలో జిల్లాల్లో ఒక వ్యవస్థను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సీఎం ఆదేశించారు.  చెరువుల ఆక్రమణలపై రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామని ప్రకటించారు. చెరువుల ఆక్రమణ సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. అక్రమణల తొలగింపు నకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. హైడ్రాను ఖమ్మంకు విస్తరిస్తారా? అన్న ప్రశ్నకు ఇప్పటికిప్పుడు అటు వంటి ఆలోచన లేదని సీఎం తెలిపారు. హైదరాబాద్‌లో నివాస భవనాలను కూలగొట్టేకంటే కొత్తగా చెరువులు నిర్మించవచ్చు కదా? అన్న ప్రశ్నకు సీఎం స్పందిస్తూ చెరువుల నిర్మాణానికి ఒక పద్ధతి ఉంటదని, ఇప్పటికిప్పుడు చెరువుల నిర్మాణం కుదరదని అన్నారు. 

సాయం చేయండి

వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. స్వచ్చంద, కార్పొరేట్ సంస్థలు వరద బాధితులను ఆదుకొనేందుకు తమ వంతు సాయం అందించాలని కోరారు. వరద బాధితుల కోసం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇవ్వడం హర్షించదగ్గ విషయమని ప్రశంసించారు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని తన కిట్టీ బ్యాంక్‌లో దాచుకున్న రూ.3 వేలను వరద బాధితుల సహాయార్థం సీఎంకు అందజేసింది.

17౦౦ మందిని రక్షించాం

భారీ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురైన 17 వందల మంది రైల్వే ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వారికి ఆహారం, వసతి కల్పించామని చెప్పారు. విపత్తులు సంభవించినప్పుడు నష్ట నివారణ కోసం అన్ని విభాగాలతో కో ఆర్డినేషన్ కమిటీ నియమించాలని మంత్రి సీతక్క సూచించారు. 

ఆమెరికాలో కేటీఆర్ జల్సాలు 

ఆమెరికాలో జల్సాలో మునిగి తేలుతున్న కేటీఆర్ ట్విట్టర్‌లో మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నా మాజీ సీఎం కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన లేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. గత పదేళ్లలో ఒక్క రోజైనా కేసీఆర్ వరద బాధితులను పరామర్శించారా? హైదరాబాద్‌లో ఓ అమ్మాయిని దుండగులు ఎత్తుకెళ్లి రేప్ చేసి చంపితే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా? ఆయన సొంత నియోజకవర్గంలోని మాసాయిపేటలో రైలు ప్రమాదంలో పది మంది విద్యార్థులు చనిపోతే వారి కుటుంబాలను కలిసి ఓదార్చారా? లక్షల కోట్లు సంపాదించుకుని ఇప్పుడు ప్రభుత్వంపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మనో ధైర్యం కల్పించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 వేల కోట్లు ఇవ్వొచ్చుగా?’ అని ప్రశ్నించారు. 

సైంటిస్ట్ అశ్విని కుటుంబాన్ని ఆదుకుంటాం 

వరద ఉధృతిలో కొట్టుకుపోయి మృతి చెందిన యువ శాస్త్రవేత్త నూనావత్ అశ్విని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం భరోసా ఇచ్చారు. సీఎం మంగళవారం ఉదయం సింగరేణి మండలం గంగారాం తండాకు వెళ్లి అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ చిత్ర పటాలకు శ్రద్ధాంజలి ఘటించారు.   ఉజ్వల భవిష్యత్ ఉన్న గొప్ప సైంటిస్టును కోల్పోయామని సీఎ ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగం కల్పించాలని రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, ఇల్లు నిర్మించి ఇవ్వాలని కుటుంబ సభ్యులు సీఎంను కోరగా, ఒకసారి హైదరాబాద్ వచ్చి కలవమని పొంగులేటికి చెప్పారు.