రోజుకో యాపిల్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజూ యాపిల్ తింటే వైద్యుల దగ్గరికీ వెళ్లాల్సిన అవసరం ఉండదని నిపుణులు సైతం చెబుతున్నారు. యాపిల్‌లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే యాపిల్ పండుతో మాత్రమే కాకుండా యాపిల్ తొక్కతో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? యాపిల్ తొక్క కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగిస్తారు. యాపిల్ తొక్కతో చేసిన ఫేస్ ప్యాక్ చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ఇంతకీ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి? దాని ఉపయోగాలేంటో చూసేయండి..
- యాపిల్ తొక్కలను కొన్ని రోజులపాటు ఎండలో ఆరబెట్టి.. పొడిగా చేసుకోవాలి. అలా చేసుకున్న యాపిల్ పొడిలో రెండు చెంచాల మెత్తగా రుబ్బిన ఓట్ మీల్ పౌడర్‌ను యాడ్ చేయాలి. అనంతరం ఇందులో కొంచెం తేనెను కలిపి పేస్ట్‌లాగా తయారు చేసుకోవాలి. అనంతరం ఈ పేస్ట్‌ను ముఖంపై మొటిమలు, మచ్చలు ఉన్న ప్రదేశంలో అఫ్లు చేయాలి. కాసేపటి తర్వాత ముఖాన్ని శుభ్రంగా నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
- యాపిల్ తొక్కలతో మరో రకంగా కూడా ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో రెండు చెంచాల యాపిల్ తొక్క పొడిని తీసుకోవాలి. అనంతరం అందులో కొంచెం పాలను యాడ్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖంతో పాటు, మెడపై అప్లు చేసి 20 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. యాపిల్ తొక్కలోని విటమిన్ ఎ, సి, ఇ, కెలు చర్మాన్ని తేమగా మార్చడంలో ఉపయోగపడతాయి. అలాగే మచ్చలు, మొటిమలు తగ్గడంలో ఉపయోగపడతాయి. కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు కూడా తగ్గిపోతాయి.