దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మైసూర్ నగరం ఒకటి. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని కూడా పిలుస్తారు. భారతీయ సాంస్కృతిక, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలుగా చెప్పుకునే ఎన్నో అద్భుత కట్టడాలు, ప్రదేశాలు ఈ నగరంలో కొలువై ఉన్నాయి. గంధపు చెక్కల సువాసనలు, గులాబీల గుభాళింపులతో మైసూర్ నగరాన్ని శాండిల్ వుడ్ సిటీ అని కూడా పిలుస్తారు.
మైసూర్‌లో ఉండే అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
మనదేశంలో చూడదగ్గ ప్రదేశాల్లో మైసూర్ ప్యాలెస్ ఒకటి. అద్భుతమైన చారిత్రాత్మక భవనం. మైసూర్ ప్యాలెస్ దసరా ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. దేశవిదేశాల నుంచి ప్రజలు ఇక్కడి ఉత్సవాలను చూడటానికి వస్తుంటారు.
ఈ ప్యాలెస్ మైసూరుకు చెందిన రాజ వంశస్తుల పూర్వపు నివాసం. ఇండో శైలిలో నిర్మించిన మైసూర్ ప్యాలెస్ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. 1912లో వడయార్ వంశంలోని 24వ పాలకుడు దీన్ని నిర్మించాడు. మనదేశంలో అతిపెద్ద ప్యాలెస్‌లలో ఇది ఒకటి.
సోమనాథపుర దేవాలయం
మైసూర్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో సోమనాథపుర దేవాలయం ఉంది. దీన్ని చెన్నకేశవ, కేశవ ఆలయం అని కూడా అంటారు. హొయసల రాజు నరసింహ వద్ద సైన్యాధిపతిగా ఉండే సోమనాథ దండనాయక 1258లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.
ఈ వైష్ణవ ఆలయంలో శ్రీకృష్ణున్ని చెన్నకేశవునిగా కొలుస్తారు. హొయసల రాజుల కాలంలో నిర్మించిన 1500 ప్రాచీన ఆలయాల్లో ఇదొకటి. ఈ ఆలయ నిర్మాణ సౌందర్యాన్ని, అందమైన పరిసరాలను వీక్షించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
చాముండేశ్వరి ఆలయం
మైసూర్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి చాముండేశ్వరి ఆలయం. ఈ ఆలయ నిర్మాణశైలి పర్యాటకులను 12వ శతాబ్దంలో తీసుకెళ్తుంది. ఆలయంలోని ప్రధాన దేవత అయిన చాముండేశ్వరి అమ్మవారి విగ్రహం బంగారంతో చేయబడింది.
ఈ అమ్మవారి దర్శనం భక్తులకు ఓ మంచి అనుభూతిని ఇస్తుంది. ఏడంతస్తుల గోపురంతో పాటు వెండితో చేసిన ముఖద్వారం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. మైసూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో చాముండేశ్వరి ఆలయం ఉంటుంది.
కరంజి సరస్సు
మైసూర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో కరంజి సరస్సు ఉంటుంది. ఈ సరస్సు 90 హెక్టార్లలో విస్తరించి ఉంటుం ది. దీన్ని ఫౌంటెన్ లేక్ అని కూడా పిలుస్తారు. చుట్టూ ఆహ్లాదకర వాతావరణంతో ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ సరస్సు పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సరస్సు మైసూర్ జూ అథారిటీ ఆధీనంలో ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు చక్కటి గమ్యస్థానం.
సిటీ షాపింగ్
మైసూర్‌కు వెళ్తే మాత్రం కచ్చితంగా షాపింగ్ చేయాల్సిందే.. ఎందుకంటే స్థానికంగా ఆకట్టుకునే హస్తకళలు అద్భుతంగా ఉంటాయి. మైసూర్ సిల్క్ చీరలు, చందనపు కళాఖండాలు, హస్తకళలు, ధూపం స్టిక్స్, గంజిఫా పెయింటింగ్స్ అని పిలువబడే మైసూర్ సాంప్రదాయ పెయింటింగ్స్ వంటి అనేక కళలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి.
ఎలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి 723 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి రైలు, బస్సు సౌకర్యం కలదు. అక్కడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది.