calender_icon.png 24 December, 2024 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెండితెరపై తెగిన అందె

21-10-2024 12:00:00 AM

నాంపల్లి లత థియేటర్.. సన్నగా శెహనాయి మోగింది.. చల్తే చల్తే.. అంటూ ఆమె తన కాలి గజ్జెలను ఆడించింది.. హాలు దద్దరిల్లింది.. జేబుల్లోని నాణేలు గుప్పిట్లో పట్టుకొని ప్రేక్షకులు తెరపైకి విసిరారు.. ఆమె పాకీజా.. ప్రతి చిత్రంలోనూ అభిమానులను సమ్మోహన పరిచిన నటి. 

విషాద పాత్రలు పోషించడం అంత ఈజీ కాదు.. విషాదభరితమైన సీన్లతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయేది. ఆ పాత్రలను అలవోకగా చేసి ‘ట్రాజెడీ క్వీన్ ఆఫ్ బాలీవుడ్’ గా కీర్తి గడించింది మీనా కుమారి. బహుశా ఆమె కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. తన నిజ జీవితంలో కూడా అంతే ట్రాజెడీ ఉంటుందని. సినిమాల ద్వారా పేరు, డబ్బు సంపాదించింది కానీ ప్రేమ, పెళ్లి ఆమె జీవితాన్నే నాశనం చేశాయి.

లెజెండరీ నటిగా, ట్రాజెడీ క్వీన్‌గా పేరొందిన మీనా కుమారి జీవితం విషాదంగానే ముగిసింది. మీనా కుమారి 1933 ఆగస్టు 1న జన్మించారు. ఆమెకు అసలు ‘నాజ్’, ‘మున్నా’ అనే ముద్దు కూడా పేర్లున్నాయి. అందానికి అచ్చమైన నిదర్శనం. మీనా నాలుగేళ్లకే నటనా జీవితంలోకి ప్రవేశించారు. బాలీవుడ్ సినిమాల్లో అంకితభావం తో పని చేసి, నటనలో తనదైన ప్రతిభను చాటుకున్నారు.

నటిగా ఆమె కన్నీటి వాకిళ్లు, ఆమె జీవితంలో జలపాతాలయ్యాయంటే అతిశయోక్తికాదు. దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి దిగ్గజ నటులే ఆమె ముందు అభినయించడానికి జంకేవారు. సత్యజిత్ రే లాంటి దిగ్గజ దర్శకులు ఆమె అభినయం ప్రతిభకు ఫిదా అయిపోయేవారు. 30 ఏళ్ల కెరీర్.. అన్నీ క్లాసిక్ మూవీలే. బైజు బావరా, ఫాకీజా, సాహెబ్, బీబీ ఔర్ గులాం, మేరే అప్నే, పరిణీత, దిల్ అప్నా ఔర్ ప్రీత్, పరాయి, ఫుట్ పాత్, ఫూల్ ఔర్ పత్తర్, ఆజాద్ ఇలాంటి ఎన్నో సూపర్ హిట్లు. దాదాపు 90 సినిమాల్లో నటించారు. ఆ రోజుల్లోనే ఇంపాలా కారు కొన్న ఏకైక నటి మీనా కుమారి. 

మీనా కుమారి.. ధర్మేంద్రను తొలిచూపులోనే ప్రేమించింది. అటు ధర్మేంద్ర ఆమెను గురువుగా, గైడ్‌గా భావించేవాడు. చివరికి ఆమె ప్రేమను అర్థం చేసుకున్నాడు. కానీ ఆమెకు నచ్చినట్లుగా కాకుండా తనకు నచ్చినట్లుగానే ఉండేవాడు. అలా మూడేళ్లకే బంధం ముగిసిపోవడంతో మీనా కుమారి మందుకు బానిసైంది.

ఆ సమయంలో దర్శకుడు కమల్ ఆమ్రోహి ఆమెకు దగ్గర య్యాడు. కమల్‌తో స్నేహం, ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే కమల్‌కు పెళ్ళయి పిల్లలున్నారు. పైగా ఆమె కంటే 16 ఏళ్లు పెద్దవాడు కూడా! కమల్ అమ్రోహితో పెళ్లి మీనా కుమారి జీవితాన్ని అతలాకుతలం చేసింది. అతడి పొసెసివ్‌నెస్ భరించలేక పోయింది. ఆ పెళ్లి ఎనిమిదేళ్లు సాగినా కలహాల కాపురమే అయింది.

మీనా కుమారితో సినిమాలు చేసిన దర్శక, హీరోలు చాలామంది ఆమెతో ప్రేమలో పడ్డవారే. ఆమె అందానికి ఫిదా అయినవారే. ఆ వరుసలోనే భరత్ భూషణ్, రాజ్‌కుమార్ కూడా ఉంటారు. భరత్ భూషణ్, మీనా కలయికలో వచ్చిన చిత్రం ‘బైజూ బావ్‌రా’. సూపర్, డూపర్ హిట్.  ‘పాకీజా’ మూవీ షూటింగ్ సమయంలో డైరెక్టర్ కమల్ ‘కెమెరా.. యాక్షన్’.. అని చెప్పినా హీరో రాజ్‌కుమార్ చెప్పాల్సిన డైలాగ్స్ మరచిపోయి మీనానే చూస్తుండి పోయేవాడట. అయితే మీనా కలల ప్రాజెక్ట్  ‘పాకీజా’ విడుదలైన మూడు వారాలకే తీవ్ర అస్వస్థతతో ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంది. 

* సాహెబ్ బీబీ ఔర్ గులాం.. మీనాకుమారి పాత్ర భారతీయ వెండితెరపై మద్యం సేవించింది. మన సిని మాల్లో ఒక స్త్రీ పాత్ర మద్యం సేవించడం దేశ చలనచిత్ర చరిత్రలో అదే మొదటిసారి. నజావో సయ్యా.. అని ఆమె ఎంత మొత్తుకున్నా రెహమాన్ వెళ్లిపోయాడు. గులాం ఒంటరిగా మిగిలిపోయింది. రాత్ ఖతం, బాత్ ఖతం.. అభిమానుల స్మృతి పథంలో మీనాకుమారి జ్ఞాపకం గాలిలో మిలితమైన అందెల రవళి.