11-04-2025 12:24:32 AM
చారకొండ, ఏప్రిల్ 10: అపర భద్రాద్రిగా పేరొందిన శిరుసనగండ్ల సీతా రామచంద్ర స్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా పెద్ద రథోత్సవం గురువారం తెల్లవారుజామున అత్యంత రమణీయంగా జరిగింది. వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. రకరకాల పూలతో అలకరించిన పెద్ద రథానికి వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పూజలు చేసి ప్రారంభించారు.
భారీ స్థాయిలో భక్తులు హాజరు కావడంతో గుట్టపై ఉన్న ఇళ్లపై నుంచి రధోత్సవాన్ని భక్తులు కన్నులారా వీక్షించారు. చాలా మంది భక్తులు బుధవారం రాత్రే శిరుసనగండ్ల గుట్టపైకి చేరుకుని అక్కడే జాగరణ చేశారు. కళాకారులు సత్యహరిశ్చంద్ర నాటకం ప్రదర్శించారు.
రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్త్స్ర శంషుద్దీన్ ఆధ్వర్యంలో దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు.
గుట్టపైకి వాహనాలు రాకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామశర్మ, ఈవో ఆంజనేయులు, అర్చకులు లక్ష్మణ శర్మ సీతారామ శర్మ మురళి శర్మ, నాయకులు వెంకట్ గౌడ, నర్సింహ్మా రెడ్డి, సందీప్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.