30-01-2025 12:00:00 AM
చేవెళ్ల, జనవరి 29: చేవెళ్ల మండల కేంద్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. మాఘ అమావాస్యను పురస్కరించుకుని బుధవారం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవాన్నికన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవుని వామనాచార్యుల ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లను పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు.
అంతకుముందు విశ్వ కర్మలు కఠిన శ్రమతో తయారు చేసిన రథాన్ని పుష్పాలతో అందంగా అలంకరించి, స్వామివారికి ప్రత్యేకంగా వస్త్రాభరణాలు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి ప్రారంభమైన ఊరేగింపు గ్రామంలోని రచ్చబండ హనుమాన్ దేవాలయం వరకు సాగింది.
స్వామివారి రథోత్సవాన్ని దర్శించేందుకు చేవెళ్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపు ప్రాంతమంతా భక్తి భావంతో మారుమ్రోగింది. ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు సమిష్టిగా కృషి చేశారు