చెంచు మహిళపై ఎలుగుబంటి దాడి!
తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
అచ్చంపేట మే 24: మేకల కాపలాకు వెళ్లిన చెంచు మహిళపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల ఈస్ట్ బీట్ పవనకుంట ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. చెంచుగూడెం గ్రామానికి చెందిన నిమ్మల సాలమ్మ మేకల కాపలాకు అడవికి వెళ్లిన సమయంలో పిల్లలతో సంచరిస్తున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఈ ఘటనలో సాలమ్మ తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే కుప్పకూలింది. సమాచారం అందుకున్న అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మల్లేశం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజు, మీనాక్షి ఘటన స్థలానికి చేరుకుని మహిళను అచ్చంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అటవీ సమీపంలోని గ్రామస్తులు అడవిలో ఎలుగుబంట్లు, పులులు, చిరుతలు సంచరిస్తునందున అత్యవసర పరిస్థితులు తప్ప అడవిలోకి వెళ్లవద్దని అటవీ శాఖ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ సూచించారు. పశువులు, మేకలు, గొర్రెల మేపు, కట్టెల సేకరణ కోసం అడవిలోకి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కాగా గాయపడిన బాధితురాలికి రూ.5 వేలు తక్షణ ఆర్థిక సాయం అందజేసినట్లు చెప్పారు.






