అడవిలో చెంచు మహిళపై ఎలుగుబంటి దాడి
* తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
అచ్చంపేట: మేకల కాపలాకు వెళ్లిన చెంచు మహిళపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. అటవీ అధికారులు సకాలంలో స్పందించి ఆమెను చికిత్స కోసం అచ్చంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం కొండనాగుల ఈస్ట్ బీట్ పవనకుంట ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. చెంచుగూడెం గ్రామానికి చెందిన నిమ్మల సాలమ్మ మేకల కాపలాకు అడవికి వెళ్లిన సమయంలో పిల్లలతో సంచరిస్తున్న ఎలుగుబంటి ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఈ ఘటనలో సాలమ్మ తీవ్రంగా గాయపడటంతో అక్కడికక్కడే కుప్పకూలింది.
సమాచారం అందుకున్న అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మల్లేశం, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాజు, మీనాక్షి లు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన మహిళను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి అచ్చంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అటవీ సమీపంలోని గ్రామస్తులు అడవిలో ఎలుగుబంట్లు, పులులు, చిరుతలు సంచరిస్తునందున అత్యవసర పరిస్థితులు తప్ప అడవిలోకి వెళ్లవద్దని అటవీ శాఖ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ సూచించారు. ముఖ్యంగా పశువులు, మేకలు, గొర్రెల మేపు, కట్టెల సేకరణ కోసం అడవిలోకి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే అడవి జంతువులు కనిపించిన వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎలుగుబంటి దాడిలో గాయపడిన బాధ్యతరానికి రూ. 5 వేలు ఆర్థిక సాయం అందజేసినట్లు చెప్పారు.






