13-04-2025 05:04:17 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): యువకుడిపై ఎరుగుబంటి దాడి చేసిన ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున సుమారుగా 5 గంటల ప్రాంతంలో గ్రామంలోని పోచమ్మ వాడ సమీపంలో ఎలుగుబంటి సంచరించడం గ్రామానికి చెందిన బాణాల హరీష్ అనే యువకుడు గమనించాడు. బహిర్భూమి కోసం బయటకు వెళ్లిన హరీష్ దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయగా ఎలుగుబంటి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం జమ్మికుంట లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
పట్టించుకోని అటవీశాఖ అధికారులు
గత కొన్నిరోజులుగా కాట్రపల్లి గ్రామంలో ఎలుగుబంటి సంచారం చేస్తున్న సమాచారాన్ని సంబంధిత ఫారెస్ట్ అధికారులకు గతంలో రెండుసార్లు విజ్ఞప్తి చేసిన అధికారులు తూతు మంత్రంగా వచ్చి వెళ్లారే తప్ప ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు పిల్లలకు వేసవి సెలవులు దృశ్యా ఆడుకోవడానికి పిల్లలు బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో వారిపై ఎలుగుబంటి దాడి చేసే ప్రమాదం ఉందని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటిని బంధించి వన్యప్రాణి సంరక్షణ అధికారులకు అప్పగించవలసిందిగా గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.