ఏటికేతం బట్టి ఎయిపుట్లు పండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా.. అని అన్నదాత కష్టాలను ఓ సినీకవి ఎంతో ఆర్తిగా ఆవిష్క రించాడు. ఎండకు, వానకు, చలికి వెరువకుండా రెక్కలు ముక్కలు చేసుకొని పుట్లకొద్దీ తిండిగింజలు పండిస్తున్న రైతన్నకు పంట కల్లం దాటిన కాడి నుంచి పైకం చేతికొచ్చేవరకు నానా కష్టాలు తప్పటం లేదు. పేరుకు ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నా.. రైతన్న అడుగడుగునా దళారుల చేతిలో దోపిడీకి గురవుతున్నారు. రైతన్న మాత్రమే కాదు.. ప్రభుత్వం కూడా దళారుల దెబ్బకు వేలకోట్ల నష్టపోతున్నది. అక్రమా ర్కులు మాత్రం ఎర్రతో గాలమేసి సొరను పట్టిన్నట్టు వందలు, వేల కోట్లు వెనుకేసుకొని చివరకు ప్రభుత్వాలనే మేనేజ్ చేసే స్థాయికి ఎదిగిపోతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల అవినీతి, రాజకీయ నాయకుల స్వార్థం, ప్రభుత్వ అలసత్వం వెరసి ధాన్యం కొనుగోళ్లలో వేల కొట్ల కుంభకోణానికి తెరలేసింది. ఇలా గత కొన్నేళ్లలో ఏకంగా రూ.18000 కోట్ల ధాన్యం కుంభకోణం జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అడుగడుగునా దోపిడీయే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వ్యవసాయానికి నీళ్లు, కరెంటు అంతకుముందుకంటే కాస్త సమృద్ధిగానే అందటంతో రైతన్న భారీగా వరిధాన్యం పండించటం మొదలుపెట్టాడు. దీంతో అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తిలో పంజాబ్‌కు పోటీగా ఎదిగింది. ఈ ధాన్యాన్ని మొత్తం బహిరంగ మార్కెట్లో అమ్ముకోవటం రైతుకు కష్టం అని భావించిన ప్రభుత్వం.. సొంతంగా రైతుల నుంచి కొనుగోలు చేసి.. మిల్లర్లకు ఇచ్చి.. బియ్యం పట్టించి కొంతమొత్తం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద సరఫరా చేస్తూ.. మరికొంత పేదలకు రేషన్ కార్డుల ద్వారా ఇచ్చే చౌకబియ్యం కోసం, మధ్యాహ్న భోజనం కోసం, సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేసేందుకు తీసుకొంటున్నది.
ధాన్యాన్ని సేకరించేందుకు ప్రతి సీజన్‌లో దాదాపు 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నది. రైతులు అక్కడికి ధాన్యం తీసుకొస్తే సివిల్ సప్లు అధికారులు దానిని కొని అక్కడి నుంచే మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. ఇక్కడి నుంచే దోపిడీ మొదలవుతున్నది. ప్రభుత్వ అధికారులు, దళారులు, మిల్లర్లు సిండికేట్‌గా మారి రైతులు తెచ్చిన ధాన్యానికి అనేక వంకలు పెట్టి భారీగా తరుగు తీస్తున్నారు. వాస్తవానికి సివిల్ సప్లు అధికారులు రైతులకు సూచనలు ఇస్తూ ధాన్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. తాలు, దబ్బు ఏమైనా ఉంటే శుభ్రం చేయాలని రైతులకు సూచించాలి. వర్షాలకు తడువకుండా సౌకర్యాలు కల్పించాలి. కానీ.. అధికారులు ఇవేవీ చేయటం లేదు.
నేరుగా బస్తాకు ఇన్ని కిలోలు అని తరుగు తీసి రైతుల పొట్టకొడుతున్నారు. తాము చెప్పినంత తరుగుకు ఒప్పుకొంటేనే ధాన్యం తీసుకొంటామని మిల్లర్లు మొండికేస్తుండటంతో రైతుకు మరోమార్గం లేకుండా పోతున్నది. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చేందుకు క్వింటాల్‌కు రూ30 వరకు ఖర్చు చేస్తుంటే.. ప్రభుత్వం రూ.5.60 మాత్రమే ఇస్తున్నది. అది కూడా వెంటనే ఇవ్వకుండా తీవ్ర జాప్యం చేస్తున్నది. పంట అమ్మిన రైతులకు అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడుతాయా అని వారాలతరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది.
బడా మిల్లర్లు చెప్పిందే వేదం
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ కోసం మిల్లర్లకు సరఫరా చేస్తున్నది. ఇందుకోసం డీఎస్‌వోలు, ఇతర అధికారులు మిల్లులను తనిఖీ చేసి ఆయా మిల్లులకు ఎంత ధాన్యం మిల్లింగ్ చేసే సామర్థ్యం ఉన్నదో తెలుసుకొని ఆ మేరకు కేటాయించాలి. కానీ, ఇవేవీ లేకుండా రికమెండేషన్లకు, ఆమ్యామ్యాలకు లొంగి మిల్లర్లు అడిగినంత ధాన్యం కేటాయిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే, ధరఖాస్తు చేసుకొన్న మిల్లు అసలు ఉన్నదో లేదో కూడా చూడకుండా ధాన్యం కేటాయిస్తున్నారు. ఆ ధాన్యం ఎక్కడికి వెళ్తున్నదో కూడా గమనించటం లేదు. దీంతో బడా మిల్లర్లు లక్షల క్వింటాళ్ల ధాన్యం ప్రభుత్వం నుంచి తీసుకోవటమేగానీ.. బియ్యం మాత్రం తిరిగి ఇవ్వటం లేదు.
ధాన్యం కేటాయించేటప్పుడే పెద్ద మిల్లర్లు రాజకీయం చేసి మొత్తం సన్నరకం ధాన్యమే కేటాయించేలా చక్రం తిప్పుతున్నారు. ఆ ధాన్యాన్ని తమ మిల్లుల్లో మిల్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో అక్రమంగా అమ్మేసుకొంటున్నారు. గత నాలుగైదేండ్లుగా ఇదే తంతు నడుస్తున్నది. ప్రభుత్వం ఏటా సీఎంఆర్ ఇవ్వాలని అడుగుతూ కొద్దిరోజులు హడావిడి చేయటం.. మళ్లీ తర్వాతి పంట ధాన్యాన్ని కూడా వారికే అప్పగించటం జరుగుతూ వస్తున్నది. దీంతో ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకున్నా ఏమీ కాదులే అని మిల్లర్లు మొండికేయటం మొదలుపెట్టారు. పైసా పెట్టుబడి లేకుండా ప్రభుత్వం నుంచి తీసుకొన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకొంటున్నారు.
ఆ సొమ్మును రియల్ ఎస్టేట్ వంటి వ్యాపారాల్లో పెట్టి వేల కోట్లు సంపాదిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఏటా వేల కోట్లు నష్టపోతూనే ఉన్నది. పైగా ప్రభుత్వ ధాన్యాన్ని తమ మిల్లుల్లో భద్రపరిచినందుకు క్వింటాల్‌కు అదనంగా రూ.340 ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని మిల్లర్లు కోర్టుకు కూడా వెళ్లారు. ప్రస్తుతం పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులు స్వయంగా రంగంలోకి దిగినా సీఎంఆర్‌ను మిల్లర్ల నుంచి రాబట్టలేక చేతులెత్తేస్తున్నారు. చాలాచోట్ల ప్రభుత్వం సరఫరా చేసిన ధాన్యం మిల్లులకు చేరనేలేదని తనిఖీల్లో తేలింది. మరికొన్ని చోట్ల అసలు మిల్లులే లేవు. మరి ఆ ధాన్యం అంతా ఎక్కడి పోయింది? దాన్ని వెలికితీసేది ఎవరు? ఎలా తిరిగి రాబడుతారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతున్నది.
రేషన్ బియ్యం రీసైకిల్
పేదలకు ప్రభుత్వం ఒక రూపాయికే కిలో చొప్పన తెల్ల రేషన్ కార్డులపై బియ్యం సరఫరా చేస్తున్నది. అయితే, ఆ బియ్యం లబ్ధిదారులు తీసుకోవటం లేదనే వాదన ఉన్నది. రేషన్ దుకాణాల వద్దనే లబ్ధిదారుల నుంచి దళారులు ఆ బియ్యాన్ని కిలో రూ.8 చొప్పున కొనుగోలు చేసి మళ్లీ మిల్లులకు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేదలు కూడా తినకుండా వదిలేసిన బియ్యాన్ని మిల్లర్లు పాలిష్ చేసి తిరిగి ప్రజలకు అధిక రేటుకు అమ్ముకొంటున్నారనే వాదన ఉన్నది. అంటే రూపాయి కిలో బియ్యాన్ని రూ.8కి కిలో చొప్పున అమ్ముకొంటున్న ప్రజలు.. మళ్లీ అదే బియ్యాన్ని రూ.50కి కిలో చొప్పున కొని తింటున్నారు. ఇదంతా మిల్లర్ల మాయాజాలం. రాష్ట్రంలో దాదాపు 30 శాతం నకిలీ రేషన్ కార్డులున్నట్టు అంచనా.
ఈ కార్డుదారులు తమకు వచ్చే చౌకబియ్యాన్ని ముట్టుకోనుకూడా ముట్టుకోరు. రేషన్ దుకాణాల వద్దనే అమ్మేసుకొంటున్నారు. ఈ దందాపై ప్రభుత్వానికి పట్టింపు లేకపోవటంతో ఖజానాకు ఏటా వేలకోట్ల నష్టం వాటిల్లుతున్నది. ధాన్యం, బియ్యం నిల్వ ఉంచే గన్నీ బ్యాగులది మరో బాగోతం. ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం ప్రతి పంట సేకరణ కాలంలో గన్నీ బ్యాగులను సరఫరా చేస్తున్నది. నిబంధనల ప్రకారం గన్నీ బ్యాగులను రెండుసార్లకంటే ఎక్కువ వాడకూడదు. కానీ, రాష్ట్రంలో నాలుగైదు సార్లు వాటినే వాడుతున్నారు. అధికారులు నకిలీ బిల్లులు సృష్టించి గన్నీ బ్యాగులు సరఫరా చేసినట్టు నమ్మించి ప్రభుత్వ సొమ్మును జేబుల్లో వేసుకొంటున్నారు. కొత్తవాటిని వాడాల్సిన చోట పాతవాటిని ఉపయోగిస్తున్నారు.
తడిసిన ధాన్యంతో కాసుల పంట
ఏటా అకాల వర్షాలు పడి ధాన్యం తడిసిపోతున్నది. ఈ ధాన్యాన్ని రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవటానికి నానా కష్టాలు పడాల్సి వస్తున్నది. దీంతో రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వమే తడిసిన ధాన్యాన్ని కొని బహిరంగ వేలం ద్వారా అమ్మేస్తున్నది. ఈ వ్యవహారంలోనూ మిల్లర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మంచి ధాన్యాన్ని కూడా తడిసిన ధాన్యంగా చూపించి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బడా మిల్లర్లు భారీగా లాభపడు తుండగా, నిజాయితీగా వ్యాపారం చేస్తున్న చిన్న మిల్లర్లు చితికిపోతున్నారు. బోగస్, బినామీ మిల్లులు, అసలు ఉనికిలోనే మిల్లులు మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతున్నాయి.
ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు..
- * ప్రభుత్వం ధాన్యం క్లీనర్లను, శుభ్రపరిచే యంత్రాలను, నాణ్యతను పరిశీలించే అధికారులను నియమించాలి.
* ధాన్యం కొనుగోలు సమయంలో ప్రతి కేంద్రంలో నిత్యం ఎంత ధాన్యం కొనుగోలు చేస్తున్నారో పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
* ధాన్యం కేటాయింపులో మిల్లర్స్ అసోసియేషన్‌కు ఎలాంటి సంబంధం లేకుండా చూడాలి.
* విజిలెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి.
* ధాన్యం సరఫరాను మానిటరింగ్ చేసేందుకు ఎఫ్‌సీఐతో కలిసి ఆన్‌లైన్ వింగ్స్ యాప్‌ను ఏర్పాటుచేయాలి.
* ధాన్యాన్ని నిల్వచేసేందుకు ప్రైవేటు మిల్లర్ల మీద ఆధారపడకుండా ప్రభుత్వమే మరిన్ని గోదాములను నిర్మించాలి. మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీ సమర్పించేందుకు 15 రోజులే గడువుండాలి.
* సివిల్ సప్లు విభాగంలో సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న డీఎస్‌వోలను, డిఫ్యూటీ తహసీల్దార్లను వెంటనే బదిలీ చేయాలి.
* మిల్లుల్లో ధాన్యం ఉన్నదో లేదో తెలుసుకొనేందుకు మంచి పేరున్న థర్డ్‌పార్టీని నియమించి తనిఖీలు చేయించాలి.
* ప్రభుత్వం అవసరమైన చోట లైసెన్నింగ్ విధానాన్ని అమలుచేయాలి.
* ధాన్యం పక్కదారి పట్టకుండా బ్యాంకు గ్యారెంటీ కోరాలి.
* నకిలీ అగ్ని ప్రమాదాల్లో ఎన్ని గన్నీ బ్యాగులు కాలిపోయాయో విచారణ జరిపించాలి.
* ధాన్యం సీఎంఆర్ కుంభకోణంలో వాస్తవాలు వెలుగులోకి రావాలంటే అనుమానిత అధికారులందరి ఆస్తులపై విచారణ జరిపించాలి.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి