29-03-2025 01:28:58 AM
కరీంనగర్, మార్చి 28 (విజయ క్రాంతి): జిల్లాలో ఐకెపి ఆధ్వర్యంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను 150కి పెంచుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం శివశక్తి భవన్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను 49 నుండి 150 కి పెంచుతున్నామని తెలిపారు.
కొనుగోళ్ల పట్ల ఏపీఎంలు, సెంటర్ ఇన్చార్జులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఏఈవోలు, ఏపీఎంలు, సెంటర్ ఇన్చార్జిలకు కొనుగోళ్ల అంశంలో మండలాల వారీగా శిక్షణ ఇవ్వాలని తెలిపారు. తేమ యంత్రాలు సమకూర్చాలని, రైతులకు అన్ని వసతులు కల్పించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు నమోదు ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని అన్నారు. ధాన్యం రకాలు, నిర్దిష్ట ప్రమాణాలు తెలియజేసే బ్యానర్లను కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శించాలని సూచించారు.
వచ్చే ఏడాది స్త్రీనిధి రుణాలకు సంబంధించి భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. అర్హత ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు అందజేయాలని అన్నారు. బ్యాంకు లింకేజీ రుణాలను పెంచాలని సూచించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ శ్రీధర్, అడిషనల్ డి ఆర్ డి ఓ సునీత, డీపీఎంలు ప్రవీణ్, తిరుపతి, స్త్రీనిధి అధికారి రవికుమార్ పాల్గొన్నారు.