18-03-2025 01:35:58 AM
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, మార్చ్ 17 (విజయ క్రాంతి) : వేసవి కాలం నేపథ్యంలో వడగాల్పులు, ఎండతీవ్రత కు తీసుకోవలసిన జాగ్రత్తలు పై విస్తృత ప్రచారం చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆయా శాఖల అధికారులకు సూచించారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ వేసవిలో హీట్ వేవ్ 2025 పై సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయుటకు సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని రోజురోజుకి భానుడి ప్రతాపం పెరుగుతున్న సందర్భంగా మానవ, జంతవుల జీవితాల పై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలన్నారు.
వేసవి కాలం ఈ నాలుగు నెలలు అప్రమత్తంగా ఉంటూ ఆశా కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరి దగ్గర అవసరమైన మేర ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, ఆవసరమైన మందులు అందుబాటులో ఉండాలని ఆన్నారు. మధ్యహ్నం సమయాల్లో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు.
ప్రతి కూడళ్లలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఆర్డీఓ వినోద్ కుమార్, డీఈఓ ప్రణీత, డి.ఎం.హెచ్.ఓ నరేందర్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.