ఆశ, అత్యాశలే సైబర్ నేరగాళ్ల ఆయుధాలు: ఎస్పీ అశోక్’కుమార్
జగిత్యాల, జనవరి 22 (విజయక్రాంతి): విలాసవంతమైన వస్తువులిస్తామని, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని, విదేశీ యాత్రలకు పంపుతామని, రక రకాల మాయ మాటలతో ఆఫర్లు పెట్టి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల ఎస్పీ అశోక్’కుమార్ పేర్కొన్నారు.
ఈ మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రజలనుండి మొదటగా సభ్యత్వాలను స్వీకరించి, వారితో మరి కొంత మందిని సభ్యులుగా చేర్పించే ప్రయత్నం చేస్తూ, ఎంత ఎక్కువ మందిని సభ్యులుగా చేర్పిస్తే అంత అధిక మొత్తంలో డబ్బులు తిరిగొస్తాయని నమ్మించి ప్రజల్ని మభ్యపెట్టే కొత్త కొత్త టెక్నిక్‌లతో సైబర్ నేరగాళ్లు మార్కెట్లోకి వస్తున్నారని వివరించారు.
ఇలాంటి నూతన స్కీంల పట్ల, నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, మనకు ఎటువంటి సంబంధం లేని వాళ్ళు మనకు ఏ విధమైన ఆర్థిక ప్రయోజనం ఊరికే చెయ్యరని పేర్కొన్నారు. మనల్ని నమ్మించి, మభ్యపెట్టి, వంచించి మన దగ్గరి మరికొందరి కష్టార్జితాన్ని కొల్లగొట్టడమే వారి పనని, మన ఆశ, అత్యాశలే వారి ఆయుధాలని, ఇలాంటి నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
మొబైల్ ఫోన్లను చూసే మనకు ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లింక్స్, ఈ మెయిల్, వ్బుసైటు, ఫోన్ కాల్స్ ద్వారా మీ దృష్టిని ఆకర్షించే కుట్రలకు ఎట్టి పరిస్థితుల్లో లొంగవద్దని, తొందరపడి బాధలను, నష్టాలను కొని తెచ్చుకోవద్దని ఎస్పీ సూచించారు.
అన్ని జాగ్రత్తలను తీసుకున్నా మోసపోయిన పక్షంలో ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు గానీ www.cybercrime.gov.in ద్వారా కానీ ఫిర్యాదు చేయాలన్నారు. మీ సమీప పోలీస్ స్టేషన్లో నైనా వెంటనే పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాల నివారణ గురించి జిల్లాలో డీ౪సీ డీఎస్పీ రంగారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పనిచేస్తుందని ఎస్పీ అశోక్’కుమార్ వివరించారు.