calender_icon.png 25 October, 2024 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్రమత్తంగా ఉండండి

02-09-2024 12:33:07 AM

మరో 24 గంటలు భారీ వర్షాలే

ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉండొద్దు

అధికారులు అందుబాటులో ఉండాలి

అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు

జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యాసంస్థలకు నేడు సెలవు

మిగతా జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం

కలెక్టర్లు, ఎస్పీలకు మంత్రి పొంగులేటి ఆదేశాలు

పాలేరు సంఘటనపై మంత్రి భావోద్వేగం 

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రాష్ర్టంలో సోమవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.

ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుదని భరోసా ఇచ్చారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులు, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గంలో వరద విలయంపై ఆదివారం ఉదయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌తో పాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించి సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు అప్పటికప్పుడు అవసరమైన ఆదేశాలను జారీ చేశారు.

మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్, వైద్య ఆరోగ్య, నీటి పారుదల, రెవెన్యూ, విపత్తు నిర్వహణ, జీహెచ్‌ఎంసీ, జలమండలి, ట్రాన్స్‌కో తదితర శాఖల అధికారులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. 

ప్రాణ నష్టం లేకుండా చూశాం

రాష్ర్టవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడే ఉపద్రవాన్ని ముందస్తుగా ఎదురుర్కొనేందుకు చేపట్టిన చర్యల వల్ల చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా కాపాడగలిగామని పొంగులేటి తెలిపారు. ఎన్ని చర్యలు తీసుకున్నా వివిధ ఘటనల్లో ౯ మంది చనిపోవటం దురదృష్టకరమని అన్నారు. ఖమ్మం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పాలేరులో వరదల్లో చిక్కుకున్న ఒక కుటుంబాన్ని రక్షించడానికి చేయని ప్రయత్నమంటూ లేదని తెలిపారు. నేవీ, డిఫెన్స్, హకీంపేటలో హెలికాప్టర్లను సిద్ధం చేసినా వాతావరణం అనుకూలించక అవి అక్కడికి వెళ్లలేకపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. వరదల్లో ఇంటిపైకి ఎక్కిన ఒకే కుటుంబలోని ముగ్గురు వరదల్లో కొట్టుకుపోయారని, అందులో ఒకరిని రక్షించగలిగామని, మరో ఇద్దరిరి రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. 

జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యా సంస్థలకు సెలవు 

గోదావరి, కృష్ణా నదులతోపాటు పలు వాగుల ద్వారా వచ్చే వరదను ఎప్పటి కప్పుడు అంచనా వేసి పకడ్బందీగా నీటిని వదలడం వల్ల చెరువులు, కుంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని మంత్రి తెలిపారు. రాష్ర్టంలో అన్ని చెరువులు పూర్తి స్థాయిలో నిండి, మరింత వరద వస్తే తెగే ప్రమాదమున్నందున, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వరదలు, వర్షాల ప్రభావం అధికంగా ఉండి నీటిలో చిక్కుకున్న పలువురు గ్రామీణులను సురక్షితంగా కాపాడామని చెప్పారు.

పరిస్థితుల తీవ్రత దృష్ట్యా అన్ని స్థాయిల అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని సీఎస్‌ను ఆదేశించినట్లు తెలిపారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్లకు సూచించారు. హైదరాబాద్‌తో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించినట్లు తెలిపారు. 

ప్రజలను అప్రమత్తం చేశాం

సోమవారం సాయంత్రం వరకు ప్రజలు బయటికి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పాత ఇండ్ల గోడలు నాని కూలే పరిస్థితి ఉండటంతో ముందస్తుగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. మహబూబాబాద్, డోర్నకల్ మధ్య రైల్వే లైనుపై వర్షం నీరు చేరటంతో రైళ్ల్ల రాకపోకలు నిలిచిపోయాయని వెల్లడించారు. రైళ్లలోని ప్రయాణికులకు రాష్ర్ట ప్రభుత్వ తరఫున భోజన వసతి కల్పించి బస్సులు ఏర్పాటు చేసి వారిని అక్కడినుంచి తరలించినట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా సహాయ చర్యల్లో భాగస్వాములై ప్రజలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.

భావోద్వేగానికి గురైన మంత్రి పొంగులేటి

శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తన నియోజకవర్గం పాలేరులోని కూసుమంచి మండలం నాయకన్ గూడెంకు చెందిన ఇటుక నిర్మాణ కార్మికుడు యాకూబ్ ఆయన భార్య సైదా వరదల్లో కొట్టుకొనిపోవడం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఉదయం నుంచి ఆ కుటుంబాన్ని రక్షించేందుకు మంత్రి ప్రయత్నించారు. విలేకరుల సమావేశం జరుగుతున్న సమయంలోనే యాకూబ్ కుటుంబం వరదల్లో కొట్టుకుపోయిందని సమాచారం అందడంతో ఆ కుటుంబాన్ని ఇంకా ఆ భగవంతుడే కాపాడాలని భావోద్వేగానికి గురయ్యారు. వరద నీటిలోనైనా వారిని రక్షించాలని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.

ముగ్గురిలో ఒకరిని కాపాడగలిగారు. అన్నీ ఉన్నా కూడా వాతావరణం అనుకూలించక వారిని రక్షించుకో లేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను ఉదయం నుంచి ఆ కుటుంబాన్ని కాపాడేందుకు చేయని ప్రయత్నం లేదు. నేవీ, ఎయిర్ ఫోర్స్‌తో పాటు హకీంపేటలోని పలు హెలికాప్టర్లను నాయకన్ గూడెంకు పంపేందుకు ఫోన్‌ల మీద ఫోన్ లు చేస్తూనే ఉన్నాను. భారీ వర్షాలకు హెలికాప్టర్లు టేక్ -ఆఫ్ కావడం కష్టమన్న సమా ధానం వచ్చింది. మరోవైపు యాకూబ్ తోపాటు ఆయన భార్య సైదా తో నిరంతరం మాట్లాడుతూ ధైర్యం చెప్తూనే ఉన్నాను. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను కూడా అక్కడికి పంపాను. వరద తీవ్రత అధికంగా ఉండటంతో బృందాలు అక్కడికి వెళ్లలేకపోయాయి.

దీంతో స్థానిక యంత్రాంగం కాంగ్రెస్ కార్యకర్తలను సిద్ధం చేసి దగ్గరలో ఉన్న ఊరు నుంచి ఒక డ్రోన్‌ను ఆ ప్రాంతానికి పంపించి, ఆ డ్రోన్‌కు ఒక తాడు కట్టి లైఫ్ జాకెట్లను వారికి స్థానికులు అందించారు. 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు కూడా వారితో నేను మాట్లాడాను, ధైర్యం చెప్పాను. ఇంతలోనే భారీ వరద పోటెత్తడంతో వారు ఉన్న ఇంటిగోడ కూలి వరదలో కొట్టుకుపోయారు. అయినప్పటికీ వారి కొడుకు షరీఫ్‌ను రక్షించగలిగాం’ అని మంత్రి తెలిపారు. ఆ కుటుంబాన్ని రక్షించడానికి చివరి వరకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలో రాష్ర్టంలో ఎవరూ వరదలు పోటెత్తే ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు. అధికార యంత్రాంగం కూడా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.