calender_icon.png 20 September, 2024 | 5:26 PM

భారత్‌లో మౌనంగా ఉండండి

06-09-2024 01:21:55 AM

  1. అక్కడి నుంచి పొలిటికల్ కామెంట్స్ చేయొద్దు 
  2. హసీనాకు బంగ్లా తాత్కాలిక అధ్యక్షుడి హెచ్చరిక

ఢాకా, సెప్టెంబర్ 5: భారత్‌లో తలదాచుకున్న తమ దేశ మాజీ అధ్యక్షురాలు హసీనా పొలిటికల్ కామెంట్స్ చేయడం మానుకోవాలంటూ బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను బంగ్లాకు అప్పగించేంతవరకు మౌనంగా కూర్చోవాలని సూచించారు. లేని పక్షంలో ఆమె వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని హెచ్చరించారు. బంగ్లా రాజధాని ఢాకాలోని తన అధికారిక నివాసంలో యూనస్ గురువారం మీడియాతో మాట్లాడారు. ‘హసీనా భారత్‌లో ఉండి మాట్లాడడం మమల్ని ఇబ్బంది పెడుతోంది.

ఆమె అక్కడే ఉండాలనుకుంటే.. బంగ్లాకు పంపాలని మేం కోరేవరకు మౌనంగా ఉండాలి. ఆమె సైలెంట్ గా ఉండకుండా పొలిటికల్ కామెంట్స్ చేయడాన్ని ఇక్కడ ఎవరూ ఇష్టపడరు. ఆమె చేసిన దురాగతాల నుంచి ప్రజలకు న్యాయం అందించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రతిఒక్కరికీ న్యాయం జరగాలంటే హసీనాను స్వదేశానికి తీసుకురావాలి. ఆమెను అందరి సమక్షంలో విచారించాలి’ అని యూనస్ పేర్కొన్నారు. తాము భారత్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నామని, హసీనా నాయకత్వంలోనే బంగ్లా స్థిరంగా ఉంటుందనే అభిప్రాయాన్ని ఆ దేశం వీడాలని కామెంట్ చేశారు.

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనా కొన్నిరోజుల కింద బంగ్లా పరిణామాలపై తొలిసారి స్పందించారు. తనకు న్యాయం కావాలని డిమాండ్ చేశారు. హింసాత్మక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన హసీనా.. ఈ నెల 15న బంగబంధు భవన్ వద్ద మృతులకు నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ కామెంట్స్ చేశారు.