calender_icon.png 28 April, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిలేషన్‌షిప్‌లో నిజాయితీగా ఉంటా

28-04-2025 01:23:33 AM

కమల్‌హాసన్ తనయగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శ్రుతిహాసన్ కెరీర్‌లోనే కాదు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకుంది. కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న అవమానాలతోపాటు రిలేషన్‌షిప్ గురించి మాట్లాడింది.

తన గత ప్రేమ కథలను బహిర్గతం చేసింది. సరైన ప్రేమను పొందడంలో తాను ఎన్నోసార్లు విఫలమయ్యానని చెప్పుకొచ్చింది. “నేను జీవితంలో ఇలాంటి పని చేశానా.. అని బాధపడిన సందర్భాలు పెద్దగా ఏమీలేవు. కానీ, కొన్నిసార్లు నాకెంతో ఇష్టమైన వారిని బాధపెట్టాను. అది అనుకోకుండా జరిగినప్పటికీ.. అలా చేయకుండా ఉండాల్సిందన్న భావన ఎప్పటికీ ఉంటుంది.

అందుకే జీవితాంతం వారికి క్షమాపణలు చెప్తూనే ఉంటా. ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో ఒక విఫల ప్రేమగాథ ఉంటుంది. ఎక్స్ వల్ల మనకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి. అలాంటి బ్రేకప్ స్టోరీలు నాకూ ఉన్నాయి. బ్రేకప్ అయిన తర్వాత దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించను. అయితే, నా లవ్‌స్టోరీల గురించి చాలా మంది మాట్లాడుతుంటారు.

‘ఇతడు ఎన్నో బాయ్‌ఫ్రెండ్?’ అని అడుగుతుంటారు. వాళ్ల దృష్టిలో అది కేవలం నంబర్ మాత్రమే. కానీ, నాకు అలా కాదు. నేను కోరుకున్న ప్రేమను పొందడంలో అన్ని సార్లు విఫలమవుతున్నానని అర్థం. ఇది వాళ్లకు అర్థం కాదు. అది నన్ను బాధ పెడుతుంది. ఎందుకంటే నేనూ మనిషినే కదా! బ్రేకప్ అయినంత మాత్రాన ఆ వ్యక్తిని తప్పుపట్టే రకం కాదు నేను. ఎందుకంటే మనిషి మారడం సహజం అని నాకు తెలుసు. రిలేషన్‌షిప్‌లో నేను నిజాయితీగా ఉంటాను” అని చెప్పింది శ్రుతిహాసన్.