భైంసా (విజయక్రాంతి): మెను ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. భైంసా సుభాష్‌నగర్‌లోని కేజీబీవీని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. వంట గదిలోని బియ్యం, వంట సామగ్రి, కూరగాయల నాణ్యత, నిల్వ, గడువుల తేదీలను పరిశీలించారు. విద్యార్థులకు భోజనం వండి వార్చడంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు సరకులను, పరిసరాల పరిశుభ్రత, తాగునీటిని గమనించాలన్నారు. అలాగే విద్యార్థుల ఆరోగ్య స్థితిని చూస్తూ ఉండాలని, అనారోగ్యంతో ఉంటే వెంటనే వైద్యులకు చూపించాలన్నారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే తల్లిదండ్రులకు ఉన్నతాధికారులు సమాచారం ఇవ్వాలన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన పాఠశాల అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ప్రిన్సిపల్ జ్యోతి, ఉపాధ్యాయులు, పదోతరగతి విద్యార్థినులతో విద్యాబోధన తీరుపై మాట్లాడారు. లోతైన విషయ పరిజ్ఞానాన్నిపెంచుకుని మంచి ఫలితాలు సాధించాలన్నారు.