calender_icon.png 20 April, 2025 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలాంటి ఆహారంతో జాగ్రత్త

20-04-2025 12:00:00 AM

మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కలుషిత ఆహారం తీసుకున్నా, నిల్వ ఉన్న ఆహారం తిన్నా అది అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ప్రస్తుతం ఫాస్ట్‌ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ ట్రెండ్ బాగా పెరిగింది. ఎక్కువ రోజుల పాటు ఆహారాన్ని నిల్వ చేసేందుకు రిఫ్రిజిరేటర్లను విరివిగా ఉపయోగిస్తున్నాం. 

కలుషిత ఆహారం సుమారు 200 రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు కారణమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిపై కలుషిత ఆహారం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 

జాగ్రత్తలు

వంట పాత్రలను సరిగా శుభ్రం చేయాలి. వంటకు ముందు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహార పదార్థాలపై మూత ఉంచాలి. 

మురికి కాలువల పక్కన ఉండే దుకాణాల్లో విక్రయించే ఆహార పదార్థాలు తింటే అనేక రకాల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. 

మాంసం, గుడ్లు, చేపలు, పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసేటప్పుడు కూడా పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. 

రిఫ్రిజిరేటర్లలో ఎక్కువ కాలం ఆహారాన్ని ఉంచరాదు. అన్నం, కూరలు, పప్పులు, రోటీలను అందులో ఉంచితే సాధ్యమైనంత త్వరగా తినేయడం మంచిది. లేకుంటే అజీర్ణం, కడుపునొప్పి, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. 

పండ్లు, కూరగాయలను కొని ఇంటికి తీసుకొచ్చాక ఉప్పు కలిపిన నీటిలో ఉంచి కడగాలి. అప్పుడే వాటిపై ఎరువులు, పురుగు మందుల అవశేషాలు తొలగిపోతాయి.