calender_icon.png 12 January, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్లీప్ అప్నియాతో జర జాగ్రత్త

10-12-2024 12:00:00 AM

నిద్రపోయేటప్పుడు నిరంతరం గురక పెడుతుంటే కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యల బారిన పడే లా చేస్తుంది. నిద్రపోతున్నప్పుడు గురక రావడం వల్ల శ్వాస ఆగిపోతుంది. ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ఇది గుండె, మెదడు రెండింటినీ ప్రభావితం చేస్తుంది. ఎవరైనా ఎక్కువ సేపు గురక పెడితే అనారోగ్యంతో బాధపడుతున్నట్టే. ఇది పూర్తిగా నయం కాదు.

ఈ వ్యాధిని స్లీప్ అప్నియా అంటారు. చాలా అలసిపోయి కొన్నిసార్లు గురక పెడుతుంటే భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు డాక్టర్లు. బరువు పెరగడం, ఊబకాయం కారణంగా స్లీప్ అప్నియా వస్తుంది. ఈ వ్యాధి ఉంటే పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. రోగి ల్యాబ్‌కు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. ల్యాబ్‌లో నిద్ర పోతున్నప్పుడు గుండె, మెదడు అన్ని విషయాలు పర్యవేక్షించబడతాయి. 

నిద్రిస్తున్నప్పుడు బాగా కదలడం, లేవగానే నోరు పొడిబారినట్టు అనిపించడం లేదా గొంతు నొప్పి రావడం, రాత్రిపూట తరచుగా బాత్‌రూంకు వెళ్లడం, ఉదయం తలనొప్పిగా అనిపించడం, రోజంతా చాలా నిద్రమత్తుగా ఉండటం, పగటిపూట ఫోకస్ చేయడంలో ఇబ్బంది, విచారంగా లేదా కోపంగా అనిపించడం, విషయాలు గుర్తుంచుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా స్లీప్ అప్నియా కిందకు వస్తాయి. గురక చాలా బిగ్గరగా ఉండి, ఇతరులను ఇబ్బంది పెడుతుంటే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఊపిరి పీల్చుకోలేక తరచూ నిద్రలేస్తున్నా, నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడం ఆగిపోయినా డాక్టర్‌ను కలవడం మంచిది. రెగ్యులర్ శారీరక శ్రమ ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాల స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది  స్లీప్ అప్నియా తీవ్రతను తగ్గిస్తుంది. అలాగే ధూమపానం మానేయడం వల్ల కూడా ఈ ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.