calender_icon.png 16 April, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిండు కవర్లతో జాగ్రత్త!

13-04-2025 12:57:11 AM

అపరిశుభ్రమైన దిండు కవర్లు, దుప్పట్లపై బ్యాక్టీరియా పేరుకుంటుందని తాజా అధ్యయనంలో తేలింది. టాయిలెట్ సీట్లపై కంటే ఎక్కువగా సూక్ష్మక్రిములు వీటిపైనే ఎక్కువగా చేరుతాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 

బాత్‌రూమ్‌లో ఎన్ని సూక్ష్మక్రిములు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బెడ్‌రూమ్‌లో మనం నిత్యం వాడే దిండ్లపై కూడా ఇంతకంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 

దుప్పట్లు, దిండ్లపై.. 

బెడ్ షీట్స్, దుప్పట్లు, దిండ్ల కవర్లు క్రమం తప్పకుండా ఉతకకపోతే బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో పేరుకుంటుంది. నాలుగు వారాల పాటు వీటిని ఉతక్కుండా ఉంటే దిండ్ల కవర్లు, దుప్పట్లపై టాయిలెట్‌లో కంటే 17 వేల కంటే ఎక్కువ బ్యాక్టీరియా వాటిపై చేరుతుందని పరిశోధనలో తేలింది. అంటే ఒక చదరపు అంగుళంలో మూడు నుంచి ఐదు మిలియన్ల బ్యాక్టీరియా వచ్చి చేరుతాయి అని నివేదికలో పేర్కొన్నారు. 

ప్రమాదకర బ్యాక్టీరియా

గ్రామ్ నెగెటివ్ రాడ్ బ్యాక్టీరియా, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, బాసిల్లు, గ్రామ్ పాజిటివ్ కొక్కై వంటి బ్యాక్టీరియా వచ్చి చేరుతాయి. వీటిల్లో కొన్ని ప్రమాదకరం కాకపోయినా మిగతావి మాత్రం వ్యాధి కలుగజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అపరిశుభ్ర దిండ్లపై నిద్రిస్తే హానికారక బ్యాక్టీరియా, ఫంకై, ఇతర అలర్జీ కారకాల బారిన పడాల్సి వస్తుంది. మొటిమలు, ఇతర చర్మ సంబంధిత రోగాలు చుట్టుముడతాయి. చెమట, మృత కణాలు వంటివాటితో నిండిన దిండ్ల కవర్లు.. చర్మంలోని స్వేదగ్రంథుల రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తాయి. దీంతో చర్మ సంబంధిత సమస్యలు మరింత తీవ్రమవుతాయి. 

శుభ్రంగా ఉంచుకోవాలి..

స్ట్రుప్టోకొక్కస్ లాంటి బ్యాక్టీరియాతో ఇన్‌ఫెక్షన్లు కూడా వ్యాపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖంపై గాయాలు ఉన్నప్పుడు ఈ ప్రమాదం మరింత పెరుగుతుందని అంటున్నారు. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే.. దుప్పట్లు, దిండ్ల కవర్లను క్రమం తప్పకుండా శుభ్రపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.   

చర్మ, శ్వాస సమస్యలు.. 

అపరిశుభ్ర దిండ్ల కవర్లు, దుప్పట్లతో ఆస్తమా వంటి సమస్యలు కూడా తీవ్రమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రకరకాల పురుగులు, పెంపుడు జంతువుల నుంచి వెలువడే వ్యర్థాలు వంటివి ఊపిరితిత్తుల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. ఊపిరి ఆడకపోవడం, దగ్గు తుమ్ములు, కంటివెంట నీరు కారడం వంటివి వేధిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలున్న వారికి ఇబ్బందులు పెరుగుతాయి.