calender_icon.png 31 October, 2024 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్తుతో జాగ్రత్త

03-07-2024 12:05:00 AM

వానకాలంలో అప్రమత్తతే రక్ష

పొంచి ఉన్న విద్యుత్తు ప్రమాదాలు

వ్యవసాయ మోటార్ల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి

ఏటా విద్యుత్తు ప్రమాదాలతో రైతులు, మూగజీవాల మృత్యువాత

మెదక్, జూలై 2 (విజయక్రాంతి): వర్షాకాలం రానే వచ్చింది. వర్షాలు కురిసే సమయంలో రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యుత్తు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్తు ప్రమాదాల బారినపడకుండా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. గాలివానకు స్తంభాలు విరిగిపడడం, తీగలు తెగిపడడం, తీగలు కిందకు వాలిపోవడం వంటివి చోటుచేసుకుంటాయి. దీంతో ఎక్కడ విద్యుత్తు ముప్పు పొంచి ఉందో తెలియని పరిస్థితి నెలకొంటుంది. వర్షాకాలం విద్యుత్తు ప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తున్నందున రైతులు, కూలీలు వ్యవసాయ బావుల మోటార్ల వద్ద, స్టార్టర్ల వద్ద అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.  

ప్రమాదాలు ఇలా..

మెదక్ జిల్లాలో వానకాలం సాగు పనులు ప్రారంభమైనప్పటి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు రైతులు, పశువులు మృత్యువాత పడ్డాయి. గత పది రోజుల వ్యవధిలోనే జిల్లాలో వెల్దుర్తి మండలంలో ఇద్దరు రైతులు వ్యవసాయ పొలాల వద్ద విద్యుత్తు షాక్‌కు గురై మరణించారు. అలాగే పశువులు మేతకు వెళ్లినప్పుడు విద్యుత్తు తీగలు తగిలి చనిపోయాయి. వర్షాలు పడినప్పుడు గానీ, ఇతర సమయాల్లో విద్యుత్తు తీగలు తెగిపడడం, స్తంభాలు విరిగిపడి విద్యుత్తు సరఫరా జరగడంతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుం టున్నాయి. మహిళలు ఇంట్లో తీగలపై బట్టలను ఆరవేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వర్షానికి తడిసిన గోడలను, విద్యుత్తు స్తంభాలను ముట్టుకోకూడదు. విద్యుత్తు సరఫరా, ప్రమాదాల సమయాల్లో జిల్లా హెల్ప్‌లైన్ నంబర్ 79016 77782కు, టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం అందించాలని అధికారులు చెబుతున్నారు. 

తడి చేతితో తాకొద్దు..

వ్యవసాయ క్షేత్రాల వద్ద విద్యుత్తు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులు మోటార్లు, స్టార్టర్లను తడి చేతితో తాకడం వంటివి చేయకూడదు. మోటార్లలో ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు సొంతంగా మరమ్మతులు చేయకుండా మెకానిక్‌ను సంప్రదించాలి. సరఫరాలో ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు అధికారులకు సమాచారం అందించాలి. మోటార్ల వద్ద స్టార్టర్లను ఎత్తుగా ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. 

అప్రమత్తంగా ఉండాలి..

వర్షాలు కురుస్తున్న సమయంలో విద్యుత్తు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలడం, తీగలు తెగి పడడం వంటివి జరిగితే వెంటనే విద్యుత్తు అధికారులకు సమాచారం అందించాలి. రైతులు వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటు చేసిన మోటార్ల వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలి. పాత వైర్లకు బదులు కొత్త వైర్లను ఏర్పాటు చేసుకోవాలి. విద్యుత్తు టోల్ ఫ్రీ నంబర్ 1912కు లేదా జిల్లా హెల్ప్‌లైన్ నంబర్ 79016 77782కు సమాచారం అందించాలి. 

 జానకిరాములు, ఎస్‌ఈ, మెదక్