calender_icon.png 16 March, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికెన్ పాక్స్‌తో జర జాగ్రత్త

02-03-2025 12:00:00 AM

చికెన్ పాక్స్‌ను ‘తలి’్ల, ‘అమ్మవారు’ అని కూడా పిలుస్తారు. చికెన్ పాక్స్ ‘హెర్పెస్ జోస్టర్’ అనే వైరస్ ద్వారా సోకుతుంది. ఈ వైరస్ గాలిలో తేలియాడుతూ ఉంటుంది. అలా గాలి ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఈ వైరస్ ప్రమాదకరం.

అయితే పిల్లలతోపాటు పెద్దలకు కూడా సోకుతుంది. ప్రత్యేకించి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వ్యాధి తీవ్రత ఉంటుంది. అయితే చికెన్ పాక్స్ ఏంచేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుందాం.. 

* ప్రథమ దశలో అలసట, తలనొప్పి, చికాకు, ఆకలి తగ్గడం, కీళ్ల నొప్పులు, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తాయి.

* ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా, శరీరంపై ఉన్న నీటి పొక్కుల స్రావాల ద్వారా పక్కనున్నవారికి వైరస్ వ్యాపిస్తుంది. 

* శరీరంలో ప్రవేశించిన తర్వాత వైరస్ మొదటి 10 రోజుల్లో కాలేయం, ప్లీహంలో వృద్ధి చెందుతుంది. తర్వాత శరీరమంతా వ్యాపించి శ్వాసకోశానికి, చర్మానికి చేరుతుంది.

*  రెండో దశ 24 - గంటలు ఉండి, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం మొదలైన రెండో -మూడో రోజున ఎర్రటి పొక్కులు ముందుగా మొహం, ఛాతీ, వీపుపై మొదలై రెండు మూడు రోజుల్లో కాళ్లు చేతులకు కూడా వ్యాపిస్తాయి.

* పొక్కులు మొదట ఎర్రగా చిన్నగా ఉండి, రెండు, మూడు రోజుల్లో నీటి బుడగల్లా మారి మధ్యలో చిన్న గుంట పడుతుంది. దాంతో చర్మం ఎర్రగా మారుతుంది

జాగ్రత్తలు ఇవే..

* శరీరం, చర్మం, పక్క బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి.

* జ్వరానికి వైద్యులు సూచించిన మందులను మోతాదులో వాడాలి.

* వైద్యుల సలహాపై దురదకు లోషన్ రాసుకోవచ్చు. 

* తేలికగా అరిగే బలవర్థకమైన ఆహారం తినాలి.

* ఇంట్లో ఒకరికి చికెన్ పాక్స్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా గదిని కేటాయించాలి. 

* లక్షణాలపై కనీస అవగాహన కలిగి ఉండి, సత్వర వైద్యం చేయించాలి.

ఏం చేయాలి, ఏం చేయకూడదు?

* పచ్చి వేపాకుపై పడుకోబెట్టడం వల్ల దురద ఎక్కువ అవుతుంది.

* రోజుల తరబడి స్నానం పోయకపోతే చర్మంపై బ్యాక్టీరియా చేరి మరింత ప్రమాదకరంగా ఉంటుంది. 

* ఏది పడితే అది తినడం మంచిది కాదు. 

* నూనె, కారం, మసాలా తగ్గించి తినడం మేలు. పాలు, పెరుగు, తాజా పండ్లు తగినంత నీరు అవసరం. లివర్ పని తీరు సరిగా లేనప్పుడు కొవ్వులు, మాంసకృత్తులు వీలైనంత తగ్గించాలి. 

* పసిపిల్లలకు సైతం తల్లిపాలు తాగించకుండా పోతపాలు పట్టడం, చెవుల్లో, ముక్కుల్లో నూనె చుక్కలు వేయడం, పసుపు నీళ్లు పట్టడం లాంటివి చేయకూడదు.

* నాటు మందులు, ఆకు పసర్లు లాంటివి తాగించడం వలన లివర్ ఫెయిల్ అయ్యి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. 

గర్భిణుల్లో..

గర్భం తొలి దశల్లో చికెన్ పాక్స్ వస్తే వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. వెంటనే  డాక్టర్‌ను సంప్రదించాలి. గర్భంతో ఉన్నవారు, గర్భం ధరించే అవకాశం ఉన్నవారు ముందు జాగ్రత్తగా యాంటీ వైరల్ మందులు వాడకూడదు. కాన్పుకు ముందు చికెన్ పాక్స్ వచ్చినట్లయితే, తల్లి ద్వారా బిడ్డకు వైరస్ సంబంధిత యాంటీబాడీస్ సంక్రమిస్తాయి. కాబట్టి వ్యాధి వచ్చే అవకాశం తక్కువ. ప్రసవానికి నాలుగు రోజుల లోపు లేదా రెండు రోజుల తర్వాత తల్లికి పాక్స్ వస్తే, నవజాత శిశువుకు యాక్టివ్ వైరల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. 

ఐసోలేషన్‌లో ఉండాలి. 

ఇతర వైరస్‌ల మాదిరిగానే చికెన్ పాక్స్ కూడా వైరస్ లాంటిది. అందుకే ఇది ఒకరి నుంచి మరొకరి వ్యాప్తి చెందుతుంది. ప్రారంభ దశలో తక్కువ మోతాదుతో కూడిన జ్వరం, అలసట బాధిస్తుంది. ఆ తర్వాత చర్మ సమస్యలతో దద్దుర్లు వస్తాయి. అయితే దీనికి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ ఉండదు.

అయితే చికెన్ పాక్స్ ఎవరికి వచ్చినా ఐసోలేట్ కావాలి. పూర్తిగా బెడ్‌రెస్ట్‌లో ఉంటూ నీరు ఎక్కువగా తాగాలి. ఆయిల్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. అయితే హెచ్‌ఐవీ, క్యాన్సర్, గర్భిణులకు చికెన్ పాక్స్ వస్తే కచ్చితంగా డాక్టర్లును సంప్రదించి మందులు వాడాల్సి ఉంటుంది. కొంతమందికి చలికాలంలో వస్తే, మరికొందరికి ఎండకాలంలో వస్తుంది.

 డాక్టర్ శ్రీకాంత్ దుబ్బాక, ఎంబీబీఎస్, డీఎన్బీ (జనరల్ మెడిసిన్), 

అపోలో స్పెక్ట్రా, హైదరాబాద్