calender_icon.png 27 January, 2025 | 9:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌కు వెళితే జాగ్రత్త

19-07-2024 12:05:00 AM

  1. ఆ దేశంలో ఆందోళనల నేపథ్యంలో భారత్ అడ్వైజరీ
  2. అత్యవసరమైతేనే వెళ్లాలని సూచన
  3. రిజర్వేషన్లపై బంగ్లాలో కొనసాగుతోన్న నిరసనలు

న్యూఢిల్లీ, జూలై 18: కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నేపథ్యంలో మన దేశ పౌరులకు భారత ఎంబసీ గురువారం అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప బంగ్లాదేశ్‌కు ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఓ వర్గానికి అధిక కోటా ఇవ్వడంతో దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిరసనల్లో కనీసం ఆరుగురు మరణించగా 400 మందికిపైగా గాయపడ్డారు.

స్వాతంత్య్ర సమరయోధులు, వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటాను పునరుద్ధరిస్తూ జూన్ 5న బంగ్లాదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును నేపథ్యంలో ఈ ఆందోళనలు మొదలయ్యాయి. దేశంలోని చాలా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నేతృత్వంలో భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. గతంలో అమల్లోకి వచ్చిన ఈ చట్టాన్ని 2018లో రద్దు చేశారు. మళ్లీ హైకోర్టు ఆదేశాలతో ఆ రిజర్వేషన్లను పొడిగించడం ఆందోళనలకు కారణమైంది. అంతేకాకుండా నిరసనకారులను రజాకార్లతో పీఎం షేక్ హసీనా పోల్చడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు అయింది. 

రిజర్వేషన్లపై ఆందోళనలు

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విషయం చాలా సున్నితమైంది. ఏటా 4 లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటికి వస్తుండగా కేవలం 3 వేల ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం కల్పిస్తోంది. 2018 వరకు ప్రభు త్వ ఉద్యోగాల్లో 56 శాతం వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఉండగా మెజారిటీ 30 శాతం 1971 బంగ్లా విముక్తి కోసం పోరాడిన కుటుంబాలకు కేటాయించారు. అభివృద్ధి చెందని జిల్లాలకు చెందినవారు మరో 10 శాతం రిజర్వేషన్లు పొందారు. గిరిజనులకు 5 శాతం, దివ్యాంగులకు ఒక శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. దీంతో ఓపెన్ క్యాటగిరీకి 44 శాతం మాత్రమే అవకాశముండేది.