calender_icon.png 18 October, 2024 | 9:58 PM

వర్షాకాలం జాగ్రత్త సుమా!

03-08-2024 04:29:37 AM

వాతావరణానికి తగిన దుస్తులు

వర్షాకాలంలో తీవ్ర వర్షం, తేమ నుంచి రక్షించడానికి తగిన దుస్తులను ధరించడం చాలా అవసరం. పిల్లలకు రక్షణను ఇవ్వడానికి ఇందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి నాణ్యమైన రెయిన్ కోట్లు, జాకెట్లు, రెయిన్ బూట్లు వాడటం. ఇవి చిన్నారులను పొడిగా ఉంచుతాయి. వారికి జలుబు లేదా దగ్గు రాకుండా చాలావరకు చూస్తాయి. అలాగే, వారికి సౌకర్యవంతమైన దుస్తులు వేయడం మరిచి పోకండి. త్వరగా ఆరిపోయే తేలికైన, శ్వాసక్రియకు అనుకూలమైన బట్టలు ఉపయోగించండి. 

పరిశుభ్రత అత్యంత ప్రధానం

వర్షాకాలంలో పరిశుభ్రతను అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించవలసి ఉంటుంది. ఇండ్లలోకి చీమలు, దోమలు, బొద్దింకలు, క్రిములు, కీటకాలు చొచ్చుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, వానకాలం వాటికి సంతానోత్పత్తి సమయం కనుక. ఆ జీవాలకు మనం చోటు కల్పిస్తే పిల్లలు అంటువ్యాధుల బారిన పడవలసి వస్తుంది. కాబట్టి, ఇదుగో ఈ చిట్కాలు తప్పక పాటించండి. వారి చేతులను ఎల్లవేళలా (మరీ ముఖ్యంగా తినుబండారాలు పట్టుకొని తినేప్పుడు) పరిశుభ్రంగా ఉంచండి. మంచి సబ్బు నీటితో క్రమం తప్పకుండా వాళ్లు చేతులు కడుక్కునేలా చూడాలి. పరిశుభ్రత, దాని ప్రాముఖ్యతను పిల్లలకు నేర్పండి. అలాగే, ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ను నివారించడానికి వారి పాదాలు పొడిగా, శుభ్రంగా ఉండేలా చూడండి. 

ఆటాడే సమయంలో జాగ్రత్త

బాహ్య ప్రదేశాలలో పిల్లలు ఆడుకోవడానికి వెళ్లే చోటును, వాతావరణాన్ని గమనించండి. వర్షం, తేమ కారణంగా పిల్లలను ఆడుకోవద్దంటే వినరు. కానీ, వారి భద్రత విషయంలో మనమే జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులుగా చిన్నారుల ఆట సమయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారులను బయటి దోమలు కుట్టకుండా ఉండేందుకు నీరు నిలిచివున్న ప్రదేశాల వద్దకు వాళ్లను వెళ్లనీయకండి. ఇండోర్ గేమ్స్‌ను ప్రోత్సహించండి. వాతావరణం బాగా చల్లగా, ప్రమాదకరంగా ఉన్నప్పుడు, ఈదురుగాలులు వీచే వేళ ఇంట్లోనే ఆటపాటలకు ఏర్పాట్లు చేయండి. బోర్డ్ గేమ్స్, పజిల్స్, కళలు, చేతిపనుల కార్యకలాపాలలో వారిని నిమగ్నం చేయవచ్చు. 

దోమల నుంచి సంరక్షణ

వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ, మలేరియా వంటి దోమలు పేట్రేగి పోతాయి. పిల్లలను చూస్తే వాటికి మరీ అలుసు. అందువల్ల, పిల్లలను దోమల కాట్ల నుండి రక్షించడం చాలా ముఖ్యం. ఇండ్లలో కుర్చీలు, సోఫాలు, మంచాల కింద, కిటికీ కర్టెన్ల వెనుక దోమలు చేరతాయి. రసాయనాల ప్రమాదం కాకుండా ఉండే వాటి వికర్షకాలను ఉపయోగించండి. మాస్కిటో బ్యాట్‌తో వాటిని ఎప్పటి కప్పుడు ఏరి వేయండి. చంటి పిల్లలకు దోమతెరలు ఉపయోగించడం శ్రేయస్కరం. అదనపు రక్షణ కోసం దోమల ప్యాచ్‌లు లేదా బ్యాండ్లను ఉపయోగించండి. సంరక్షిత దుస్తులు తొడగండి. పొడవాటి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంట్లు ధరింపజేయండి. 

సురక్షితమైన తాగునీరు

వర్షాకాలంలో కలుషిత నీరు ఒక సాధారణ సమస్య. ఇది నీటిద్వారా సంక్రమించే వ్యాధులకు కొనితెస్తుంది. తాగు నీటిని సురక్షితంగా మార్చడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. కాచి చల్లార్చిన నీరు పూర్తి సంరక్షితం. ఇది హానికరమైన బ్యాక్టీరియాను నీటిలోంచి తొలగించి వేస్తుంది. ఫిల్టర్ వాటర్ తప్పనిసరి. మినరల్ వాటర్ బాటిల్స్ నూరు శాతం సురక్షితం కావు. ఇంట్లోనే వాటర్ ఫిల్టర్లు లేదా ప్యూరిఫైయర్లను ఉపయోగించండి. వాటిలో క్యాండిల్స్‌ను ఆరు నెలలకు ఒకసారి తప్పక మార్పించండి. బయట ఉన్నప్పుడు ఫిల్టర్ చేసిన నీటిని వెంట తీసుకెళ్లండి. శరీరం నుంచి అవాంఛనీయ విష పదార్థాలను బయటకు పంపడానికి పుష్కలంగా సురక్షితమైన నీరు పిల్లలకు ఇవ్వాలి.

పరిశుభ్రమైన పర్యావరణం

పరిశుభ్రమైన వాతావరణం వర్షాకాలంలో అత్యంత వాంఛనీయం. ఏవైనా అవాంఛిత అంటువ్యాధుల ప్రమాదాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది. అందువల్ల, చిన్నారులు అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఇల్లు, దాని పరిసరాలు శుభ్రంగానేకాక పొడిగానూ ఉండాలి. దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు ముందుగా నిలువ నీటిని తొలగించండి. చెడు సూక్ష్మక్రిములను చంపడానికి పిల్లలు ఉపయోగించే బొమ్మలు, ఫర్నీచర్ ఉపరితలాలు, తరచుగా తాకిన వస్తువులను క్రమం తప్పక క్రిమిసంహారకాలతో శుభ్రం చేయండి. తేమను నివారించడానికి మీ ఇంట్లోకి బాగా గాలి, వెలుతురు వచ్చేలా చూడండి. ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఉపయోగించడం ద్వారా సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. 

అనారోగ్య పర్యవేక్షణ 

అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, అనారోగ్యకరమైన సంకేతాల నివారణకు అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. జ్వరం, దగ్గు, జలుబు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు వంటి సాధారణ లక్షణాలు పిల్లలలో పొడసూపిన వెంటనే జాగ్రత్త పడాలి. వైద్య సహాయాన్ని కోరాలి. పిల్లల వైద్యుల సలహాలతోనే చికిత్సా పద్ధతులు పాటించండి. సాధ్యమైనంత వరకు ఔషధాల సేవనం లేకుండా తగ్గుముఖం పట్టే సహజ సిద్ధమైన విధానాలను అవలంభించండి. ముందస్తు రోగ నిర్ధారణతో చికిత్స, మందుల ఇబ్బందిని నివారించవచ్చు. పిల్లలకు రెగ్యులర్‌గా డాక్టర్ చెకప్స్ చేయించండి.