గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి బ్యాంకుల భద్రతపై బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం
గజ్వేల్, జనవరి 18: బ్యాంకు ఆవరణలో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి అన్నారు. గజ్వేల్ ఎసిపి కార్యాలయంలో శనివారం గజ్వేల్ డివిజన్ పరిధిలోని బ్యాంకుల అధికారులతో బ్యాంకుల భద్రతపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
బ్యాంకుల అంతర్గత భద్రత, ఏటీఎంలో భద్రత, సీసీ కెమెరాల యొక్క పనితీరు గురించి ఏసిపి పురుషోత్తం రెడ్డి బ్యాంకు మేనేజర్లకు సూచనలు చేశారు. ప్రతి బ్యాంకు పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, బ్యాంకు సెక్యూరిటీ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనబడిన వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలన్నారు. ప్రజలు దాచుకున్న సొమ్మును కాపాడే బాధ్యత మన అందరిపై ఉందని, బ్యాంకులలో సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయో ప్రతిరోజు మానిటరింగ్ చేయాలని సూచించారు. బ్యాంకులలో ఏదైనా సంఘటన జరిగితే కేసుల పరిశోధనలో బ్యాంకు అధికారులు సహకరించాలని సూచించారు.
ఈ మధ్యకాలంలో బ్యాంకులపై జరుగుతున్న సంఘటనపై బ్యాంకు అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగులో మాట్లాడి సైబర్ నేరాలు చేస్తున్నారని వారి పట్ల కూడా బ్యాంక్ అధికారులు, మరియు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బ్యాంకు పోలీస్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించి సైబర్ నేరాలు జరిగిన బాధితులకు డబ్బులు రిటన్ వచ్చే విధంగా కోఆర్డినేషన్తో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐలు సైదా, లతీఫ్, ఎస్‌ఐ లు రవికాంత్ రావు, శ్రీనివాస్, బ్యాంకుల మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.