calender_icon.png 24 October, 2024 | 11:48 PM

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

12-09-2024 02:32:13 PM

ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల, (విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురిలో ఉచిత వైద్య, వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను అరికట్టి వ్యాధుల బారిన పడకుండా చూసుకోవా లన్నారు. విషజ్వరాలు ప్రబలుతున్న వేళ ప్రజలు ఆందోళన చెందకుండా ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో తగినన్ని మందులు రక్త పరీక్ష చేసే కిట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

ఒకవేళ ఎక్కడైనా స్టాక్ తగ్గినట్లయితే దృష్టికి తీసుకు వచ్చినట్లయితే సరిపడినంత స్టాక్ తెప్పిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా చూసుకున్నట్లైతే మలేరియా, డెంగీ,చికెన్ గున్యా వంటి కీటక జనిత వ్యాధులనుండి రక్షించు కోవచ్చునని తెలిపారు. ప్రజలు బాధ్యతాయుతంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వాడిపడేసిన టైర్లు, తాగిన కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్ గ్లాసులు, పగిలిపోయిన కుండలలో వర్షపు నీరు నిలిచి దోమలు పెరగడానికి ఆస్కారం ఉందన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. 

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సమీయుద్దీన్ మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా మొదలగు పరీక్షలు ఉచితంగా చేసి మందులు సరఫరా చేస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు 230 డెంగ్యూ పాజిటివ్ గా నమోదు చేయబడ్డాయని, ఇంటి పరిసరాల్లో 50 హౌసెస్ వరకు ఐరిస్ స్ప్రే చేయించాం అని తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ సంఘి సత్యమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, కౌన్సిలర్ అయ్యోరి వేణుగోపాల్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఎన్. శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది, తహసీల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీవో రవీందర్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్,  తదితరులు పాల్గొన్నారు.