calender_icon.png 27 November, 2024 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బఫర్ జోన్ల జోలికొస్తే భయపడాలి!

13-08-2024 12:57:10 AM

హైడ్రాకు త్వరలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ 

  1. హైదరాబాద్‌లో 400కు పైగా చెరువులు ఆక్రమణ
  2. గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణే ప్రధాన ధ్యేయం 
  3. నటించి కాలయాపన చేసేది లేదు
  4. మీడియా సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

* హైదరాబాద్ మహానగరంలో జీహెచ్‌ఎంసీ, ఔటర్ రింగ్ రోడ్డు దాకా విస్తరించనుంది. ఓఆర్‌ఆర్ పరిధిలో 400లకు పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. ఒక్కో చెరువులో 60 శాతం నుంచి 80 శాతం వరకు ఆక్రమణలే. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మహానగర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడమే ధ్యేయంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పనిచేస్తుంది. ప్రభుత్వం మాకు కేటాయించిన విధుల్లో భాగంగా చెరువుల పరిధిలో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే.. హైడ్రా పేరు చెప్పగానే భయపడేలా, ఆక్రమణదారుల గుండెల్లో వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. 

 ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్ 

విలేకరుల సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 12 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో చెరువులు ఆక్రమణలు ఎప్పట్నుంచో జరుగుతున్న మాట నిజమే అయినప్పటికీ, ఇటీవల కాలంలోనూ ఆక్రమణలు అవుతున్నట్టు సమాచారం ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పాటు నుంచి 20 రోజులుగా చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యచరణను ప్రజలకు తెలియజేసేందుకు బుద్ధభవన్‌లో సోమవారం ఆయన విలేక రుల సమావేశం నిర్వహించారు.

నేషనల్ రిమోట్ సెన్సార్ సెంటర్ సర్వే చేపట్టిన 56 చెరువుల ఆక్రమణలకు సంబంధించిన వివరాలను పీపీటీ ద్వారా ఆయన తెలిపారు. చెరువుల ఆక్రమణలు ఆపకపోతే హైదరాబాద్ నగర జీవితం అతలాకుతలం అవుతోందని హెచ్చరించారు. 2020లో వచ్చినట్టుగా నగరానికి వరదలు వస్తే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందన్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే నిర్ధాక్షిణ్యంగా చర్యలు చేపడతామని ఆక్రమణదారులను హెచ్చరించారు. ఈ అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారులపై కూడా విచారణ చేసి చర్యల కోసం ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తామన్నారు. 

హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్

నగరంలో చెరువుల ఆక్రమణల నివారణకు ప్రభుత్వం హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఏసీపీ స్థాయి అధికారి ఈ పోలీస్ స్టేషన్‌ను పర్యవేక్షణ చేయనున్నట్టు తెలిపారు. ఈ పోలీస్ స్టేషన్‌లలో ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులను ఆక్రమించడం లాంటి అంశాలపై ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. హైడ్రాను 3 జోన్లుగా విభజించే ఆలోచన ఉందన్నారు.

ఒకవేళ అదనపు పోలీస్ స్టేషన్ అవసరమైతే, ప్రభుతానికి సిఫార్సులు చేస్తామ న్నారు. మొత్తం హైడ్రాకు 3,500 సిబ్బంది వచ్చే అవకాశం ఉందన్నారు. మొత్తం 72 బృందాలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. 20 రోజులుగా ప్రతిరోజూ 40 నుంచి 50 ఫిర్యాదులు ఆక్రమణదారులపై అందుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 650 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం కలిగిన జీహెచ్‌ఎంసీ ఓఆర్‌ఆర్ పరిధిలో 2 వేల చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం పరిధిగా మారబోతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ప్రతి ఫిర్యాదును మా టీం విచారణ చేస్తుందన్నారు. విచారణలో స్పష్టత వచ్చాక చర్యలు చేపడతామని సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో ఎలాంటి ప్రాపర్టీలు కొనుగోలు చేయరాదని ప్రజలకు సూచించారు. 

చెరువుల పునరుద్ధరణ 

ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రాలో నటించి కాలయాపన చేసేదిలేదని, కాలయాపన చేసి నోటీసులు ఇవ్వడానికి ఇంత సెటప్ అవసరం లేదని ఆయన తెలిపారు. ఆక్రమణదారులకు చట్టం అంటే భయపడేలా చేస్తామన్నారు. హైడ్రాకు సీఎం చైర్మన్‌గా ఉంటారు. ప్రతి చర్యను సీఎం పర్యవేక్షణ చేస్తారు. నగరంలో ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు హైడ్రా మూడు ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తుందన్నారు. ముందు గా చెరువుల ఆక్రమణలను నిలువరించడం.

ఆ తర్వాత ఇప్పటికే ఆక్రమణలకు గురైన చెరువులు, ప్రభుత్వ స్థలాలను రక్షణకు చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంట్లో అక్రమంగా నిర్మించిన భవనాలపై ఫోకస్ చేస్తామన్నారు. బెంగుళూరు తరహాలో ఆక్రమణలకు గురైన చెరువులను కాపాడుతూ పునర్జీవం పొందేలా చర్యలు తీసుకోవడం లాంటి గొప్ప ఉద్దేశ్యాన్ని హైడ్రా కలిగి ఉందన్నారు. నగంరలో వర్షం పడితే నీళ్లు వెళ్లడానికి ప్రత్యేక దారి లేనందున అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయన్నారు. ఒక చెరువులో నిండిన నీళ్లు మరో చెరువులోకి వెళ్లడానికి ప్రత్యేక మార్గం ఉండేలా గొలుసుకట్టు విధానాన్ని పునరుద్ధరిస్తామన్నారు.

ఈ సమయంలో ప్రజల సహకారంతోపాటు అవసరమైన మేరకు పోలీసు సహకారం తీసుకుంటున్నట్టు వివరించారు. ఇప్పటికే చేపట్టిన కూల్చివేతలలో ఒకరు బిల్డింగ్ నిర్మాణం కాకముందే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందినట్టుగా గుర్తించినట్టు తెలిపారు. ఇళ్ల నిర్మా ణం చేసే వారు తప్పనిసరిగా ఇరిగేషన్‌శాఖ ఎన్‌వోసీ తీసుకోవాలన్నారు. అసలు రిజిస్ట్రేషన్ కాదని తెలిసినా ఎందుకు కొనుగోలు చేస్తున్నారని, అలా కొనుగోలు చేస్తే ఆ తర్వాత మీరే ఇబ్బందులకు గురవుతారన్నారు. ఇదిలా ఉండగా, నగరంలోని చెరువులు, వాటి ఎఫ్‌టీఎల్ విస్తీర్ణం, బఫర్ జోన్ల వివరాలను త్వరలోనే హైడ్రా వెబ్‌సైట్‌లో ఉంచుతామని అన్నారు.

చెరువుల కబ్జాలు ఇలా..

హైదరాబాద్ మహానగరంలోని 56 చెరువులలో జరిగిన కబ్జాలపై నేషనల్ రిమోట్ సెన్సార్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) ప్రత్యేక సర్వే చేపట్టినట్టు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు చెరువుల కబ్జాల వివరాలను పీపీటీ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోని కబ్జాకు గురైన చెరువుల వివరాలు ఇలా ఉన్నాయి. 

చెరువు ఆక్రమణకు గురైన శాతం 

హుస్సేన్ సాగర్ 21

సరూర్ నగర్ 56 

మీరాలం చెరువు 32 

రామకృష్ణాపురం 71 

సఫిల్‌గూడ లేక్ 66 

మిర్యాలగూడ చెరువు 90 

పీర్జాదిగూడ చెరువు 73 

నల్ల చెరువు 90 

పిర్జాదీగూడ 65

పెద్ద చెరువు 69 

చెంగిచర్ల లేక్ 53 

పెద్ద చెరువు 71 

దమ్మాయిగూడ లేక్ 65

నాగారం లేక్ 45 

నాగోల్ లేక్ 41 

బండ్లగూడ లేక్ 83 

కుంట్లూరు పెద్ద చెరువు 90 

తమ్ములకుంట చెరువు 100 

ఇంజాపూర్ 80 

గుర్రం చెరువు 85 

పల్లె చెరువు 82 

కొంపల్లి లేక్ 84 

కొంపల్లి లేక్  1 88 

గుండ్లపోచంపల్లి 64 

ఖాజాగూడ లేక్ 88 

దూలపల్లి లేక్ 76  

ఓల్డ్ అల్వాల్ పాండ్ 82 

అల్వాల్ లేక్ 78 

రామాంతాపూర్ చెరువు 51  

తూంకుంట చెరువు 77 

రామాంతాపూర్ చెరువు1 84 

యాప్రాల్ లేక్ 86  

కౌకూర్ లేక్ 69  

కౌకూర్ చెరువు 64  

కప్పల చెరువు 64  

జిల్లేలగూడ లేక్ 85  

మంత్రాల చెరువు 76  

పెద్ద చెరువు 96