calender_icon.png 29 September, 2024 | 4:59 AM

ఫోర్త్ సిటీ నిర్మాణంలో భాగమవ్వండి

26-09-2024 03:14:02 AM

  1. తెలంగాణ వృద్ధిలో పాలుపంచుకోండి 
  2. పెట్టుబడులకు హైదరాబాద్ అనువైనది
  3. అమెరికా బృందంతో డిప్యూటీ సీఎం భట్టి  
  4. లాస్ వేగాస్‌లో మైన్ ఎక్స్‌పోకు హాజరు
  5. పలు కంపెనీల ప్రతినిధులతో భట్టి విక్రమార్క భేటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): భారత్‌లో పెట్టుబడులు, వ్యాపారాలకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఆర్థిక వృద్ధి ఇంజిన్‌గా హైదరాబాద్ కొనసాగుతోందని చెప్పారు.

ఈ క్రమంలో తమ సర్కారు ప్రభుత్వం నాలుగో సిటీని నిర్మించబోతోందని, అందులో అమెరికా కంపెనీలు భాగ స్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో పాలుపంచుకోవాలని కో రారు. అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం.. బుధవారం లాస్ వేగాస్‌లో జరిగిన మైన్ ఎక్స్ పో హాజరయ్యారు.

ఈ సందర్భంగా గ్లోబల్ మార్కెట్ అసిస్టెంట్ సెక్రటరీ అరుణ్ వెంకటరామన్, సీనియర్ పాలసీ అడ్వైజర్ ఒలిమర్ రివెరా నోవాతోపాటు అమెరికా ప్ర భుత్వ అత్యున్నత స్థాయి అధికారులతో భట్టి నేతృత్వంలోని ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ బలరామ్, స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్‌తో కూడిన రాష్ట్ర బృందం సమావేశమైంది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం ఆవశ్యతను భట్టి వివరించారు.  

అతిపెద్ద మైనింగ్ ఈవెంట్

మైన్ ఎక్స్ పో ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ ఈవెంట్. ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ పరికరాల తయారీదారులు తమ సాంకేతికతలు, ఆవిష్కరణలు, యంత్రాలను ప్రదర్శించారు. దాదాపు 1900 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నాయి. 121 దేశాల నుంచి 44 వేల కంటే ఎక్కువ మంది ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. 

పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం 

ఎక్స్ పోలో డిప్యూటీ సీఎం పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తొలుత కొమా ట్సు కంపెనీ ప్రతినిధులను కలిశారు.  అనంతరం క్యాటర్‌పిల్లర్, బీకేటీ టైర్ల మేనేజ్‌మెంట్లతో భేటీ అయ్యారు. భట్టితో భేటీ అయిన వారిలో కమర్షియల్ స్పెషలిస్ట్ శంతను సర్కార్, ఇంటర్నేషనల్ ట్రేడ్ స్పెషలిస్ట్ కార్నెలియస్ గ్యామ్ఫీ, గ్లోబల్ ఎనర్జీ సెక్టార్ లీడ్ డెరెక్ ష్లికీసెన్, గ్లోబల్ డిజైన్, కన్స్ట్రక్షన్ ట్రేడ్ స్పెషలిస్ట్ జాస్మిన్ బ్రాస్వెల్ ఉన్నారు.

హైదరాబాద్‌లో అమెరికా కంపెనీలకు అన్ని సౌకర్యాలు

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆఫీసులు ఉన్న అమెరికా కంపెనీలు చాలా సౌకర్యవంతంగా పని చేసుకుంటున్నాయని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఇంకా అనేక సంస్థల ఏర్పాటుకు అవకాశం ఉన్నందున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఖనిజ పారిశ్రామికాభివృద్ధికి దోహదపడాలని, అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

క్రిటికల్ మినరల్స్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యత, వాటి మైనింగ్ కార్యకలాపాల గురించి అమెరికా బృందంతో చర్చించారు. క్రిటికల్ మినరల్స్ వెలికితీతకు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. వృద్ధికి ఊతమిచ్చే టెక్నాలజీ సహకారంతో ఇరు పక్షాలు ముందుకు సాగితే భవిష్యత్ ఉజ్వలంగా ఉటుందని వివరించారు. అరుణ్ వెంకట రామన్ కూడా ఇరు పక్షాలు కలిసి పని చేసే అంశంపై సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో ఇరు దేశాల ప్రతినిధుల సమావశం ఫలప్రదంగా ముగిసినట్టు వెల్లడించారు.