calender_icon.png 6 February, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌పై బీసీలు తిరగబడాలె

06-02-2025 12:00:00 AM

హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్

హుస్నాబాద్, ఫిబ్రవరి 5 : కులగణన సర్వేతో కాంగ్రెస్ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని, ఆ పార్టీపై ఆయా వర్గాలు తిరగబడాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత వొడితల సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. లోకల్ బాడీ ఎలక్షన్ల నేపథ్యంలో బుధవారం ఆయన కోహెడ మండలకేంద్రంలో పార్టీ కార్యకర్తలతో జరిగిన రివ్యూ మీటింగ్ లో మాట్లాడారు.

కులగణనపై బీసీలు ఒత్తిడి చేయడంతో జీర్ణించుకోలేని కాంగ్రెస్ తప్పుడు నివేదికలు ఇచ్చి బీసీలను దెబ్బ తీసిందని విమర్శించారు. తప్పుడు సర్వేతో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. సర్వే చేసేవారు సగం ఇండ్లకు వెళ్లనే లేదన్నారు.

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చిన విధంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఈ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఏమైనా తెస్తున్నారేమో అని బీసీలు ఆశపడ్డారన్నారు. తీరా చూస్తే వారికి మొండిచేయి చూపించారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతుంటే, ఇదే రేవంత్ రెడ్డి  వివరాలు ఇవ్వవద్దని ప్రజలకు బహి రంగంగా పిలుపునిచ్చారని గుర్తుచేశారు.

ఎవరికి పడితే వారికి 57 రకాల వివరాలను ఎలా ఇస్తాం‘ అంటూ మాట్లాడారన్నారు. ఇప్పుడు సీఎం కుర్చీలో ఉండి  ప్రజలను మిస్లీడ్ చేస్తున్నా రన్నారు. ఆనాటి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీల సంఖ్య 51శాతం ఉన్నారన్నారు. ముస్లిం బీసీల జనాభా 10 శాతం కలిపితే, మొత్తం బీసీల సంఖ్య 61 శాతం ఉందన్నారు.

ఇప్పుడు 46 శాతానికి  ఎట్లా పడిపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే  బలహీన వర్గాలకు వ్యతిరేకమ న్నారు.  ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 8 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. రేవంత్ సర్కార్ కు కమీషన్లతో జేబులు నింపుకోవడంలో ఉన్న శ్రద్ధ, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో లేదని దుయ్యబట్టారు.

గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా పడిపోయిందన్నారు. కాంగ్రెస్ ది  తుగ్లక్ పాలనలో తెలంగాణ ఆగమవు తోందని విమర్శించారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. అనంతరం మండలంలోని వింజపల్లికి చెందిన గర్రెపల్లి వీరయ్యతో పాటు పలువురు బీఆర్‌ఎస్ లో చేరారు.