హుజురాబాద్ (విజయక్రాంతి): స్థానిక సంస్థలలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు సాధనకై బీసీ మహాసభ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జనవరి మూడో తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరగనున్న ఈ సభకు పార్టీలకతీతంగా బీసీలు కదలిరావాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా బీసీ సంఘం బాధ్యులు సాయికృష్ణ పిలుపునిచ్చారు. హుజురాబాద్ పట్టణంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ మహాసభ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వెళ్ళినట్లయితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీలుగా మేము ఊరుకునేది లేదు హెచ్చరించారు. సమగ్ర కులగణన సర్వే ప్రకారం మేము 60% ఉన్నందున స్థానిక సంస్థల్లో బీసీలమైన మేము అన్యాయానికి గురవుతున్నందున కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని అమలుపరచాలని బీసీ మహాసభ నిర్వహిస్తున్నాము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు పరచలేని పక్షంలో బీసీ మహాసభ ద్వారా జాగృతమై కాంగ్రెస్ పార్టీపై బీసీలందరం ఏకమై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ మూర్తి, చిలుక మారి శ్రీనివాస్, రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.