calender_icon.png 26 February, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలను గెలిపించాలి

26-02-2025 01:53:26 AM

 బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రేపు జరుగబోయే వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, కరీంనగర్ ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు.

బీసీ సంక్షేమ సంఘం, బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులుతో కలిసి జాజుల మాట్లాడారు. బీసీ సంఘాలు బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఓటర్లకు బహిరంగ లేఖను రాశారు.

సోమవారం కరీంనగర్, నిజామాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి వారి పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారని, ఎమ్మెల్సీ ఎన్నికలకు సీఎం ప్రచారం చేయడం ఇదే మొదటిసారని తెలిపారు. జెండాలకు అతీతంగా బీసీ అభ్యర్థులను గెలిపించాలని, బీసీ వాదమే అభ్యర్థిగా భావించి ఓటేయాలని టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లను కోరారు.

ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మె  ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల విజయం ఖరారైందని రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షుడు కుందారపు గణేష్‌చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు బాలరాజ్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, విక్రమ్‌గౌడ్, శ్యామ్, జాజుల లింగం గౌడ్, నరేష్, నగేష్ పాల్గొన్నారు.