16-12-2024 08:43:26 PM
బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్...
హుజురాబాద్ (విజయక్రాంతి): స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం వాటా కల్పించాలని బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ కోరారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో సోమవారం రోజు స్థానిక అంబేద్కర్ కూడలి ముందు బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో 42 శాతం వాటా కల్పించాలని సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము రానున్న స్థానిక సంస్థలలో బలహీనవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి తమ మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదే విధంగా బీసీలకు అన్ని రంగాలలో న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము చేయూతనివ్వాలని కోరారు.
బీసీ కులగణన తను గతంలో చేసిన ఆమరణ నిరాహార దీక్షాఫలితమేనని అన్నారు. ఎంత అణచివేయాలని చూసినా ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో ప్రగల్భాలు పలికి, అమలులో బీసీలను తీవ్రంగా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ఓట్లు దండుకొని మంత్రుల పదవుల్లో, కార్పొరేషన్ పదవుల్లో, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లలో, మార్కెట్ కమిటీలలో సైతం బీసీలను మోసం చేసిందన్నారు. మెజారిటీ వాటా బీసీలకు సర్పంచ్ పదవులు చేపట్టే అర్హత లేదా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ మాట్లాడుతూ..
డిక్లరేషన్ ను తప్పించుకోడానికి పంచాయతీ ఎన్నికలతో ముందుకు వస్తుందని అన్నారు. డిక్లరేషన్ ను అమలు చేయకుంటే ప్రజలు ఊరుకోరని అన్నారు. బీసీలకు తప్పకుండా 42 శాతం రిజర్వేషన్లను పెంచాలన్నారు. రిజర్వేషన్లు కల్పించడం ద్వారా అట్టడుగు వర్గాలు చైతన్యవంతులు అవుతారని అన్నారు. తద్వారా బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో మార్కెట్ కమిటీలకు కూడా రిజర్వేషన్లు కల్పించి ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్కు దక్కుతుందన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించేంత వరకు బీసీలు చేసే ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు నిస్తుందని తెపపారు.
అనంతరం జీవీ రామకృష్ణారావు, సంజయ్ కుమార్ కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సమావేశంలో కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్ వడ్లూరి విజయకుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, నాయకులు చింత శ్రీనివాస్, తాళ్లపల్లి శ్రీనివాస్, చందుపట్ల జనార్ధన్, చిలకమర్రి శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.