calender_icon.png 24 October, 2024 | 11:55 PM

బడ్జెట్‌లో బీసీలకు న్యాయం చేయాలి

22-07-2024 02:16:43 AM

ఆర్ కృష్ణయ్య డిమాండ్ 

ముషీరాబాద్, జూలై 21: బీసీల విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజికాభివృద్దికి జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం విద్యానగర్‌లోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్దికి సరిపడా బడ్జెట్ కేటాయించకుండా అన్యాయం చేస్తుందన్నారు. ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే 45 లక్షల 90 వేల కోట్ల బడ్జెట్‌లో బీసీల అభివృద్ధికి పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు.

కేంద్రంలో బీసీల పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంలను సాచురేషన్ పద్దతిలో ప్రవేశపెట్టాలని, రాష్ట్రాలకు 80 శాతం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలన్నారు. జాతీయ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలని, బడ్జెట్‌లో బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ. 50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు 80 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 14 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎర్ర సత్యనారాయణ, సీ రాజేందర్, అనంతయ్య, నందగోపాల్, వేముల రామకృష్ణ, పగిళ్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.