28-03-2025 12:20:51 AM
బీసీ బిల్లును పార్లమెంట్‌లో పెట్టేందుకు అన్ని పార్టీల నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా
ముషీరాబాద్, మార్చి 27: (విజయక్రాంతి): బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే రాజ్యాధికారంలో వాటా కావాలని మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. బీసీ బిల్లు పార్లమెంట్లో తీర్మానం చేయాలని, అందుకు అన్ని పార్టీల బీసీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కాచిగూడ లోని హోటల్ అభినందన్ గ్రాండ్స్ లో ఓ బి సి డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ కోలా జనార్దన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన హాజరై మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలలో బీసీ ఎస్సీ ఎస్టీలు అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు ప్రధా న పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు.
బీసీలకు అవకాశాలు దక్కకుండా అగ్రకులాలు, కుట్ర చేస్తున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు. బీసీల ఓట్ల కోసం అన్ని రాజకీయ పార్టీలు అనేక రకాలుగా మోసం చేస్తున్నాయన్నారు. రాజకీయ పార్టీలు బీసీలను గుర్తించాలని, లేనిప క్షంలో బీసీల తిలోదకాలు తప్పవని ఆయన హెచ్చరించారు. టీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 90% బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నారని, తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని ఆశించామన్నారు. సకల జనుల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఏ ఒక్కరి వల్ల రాష్ట్రం ఏర్పడలేదని, కానీ ఒకే కుటుంబం రాజకీయంగా అభివృద్ధి చెందిందని, రాష్ట్ర ఖజా నాను దోచుకుందని ఆరోపించారు.
రాష్ట్రం లో 42% రిజర్వేషన్ల తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందన్నారు. అలాగే బీసీ అయిన ప్రధాని పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును తీర్మానం ప్రవేశపెట్టి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమా వేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్ ముదిరాజ్, నాయకులు వేముల రామకృష్ణ, నందగోపాల్, సుధాకర్, రఘుపతి, ఓబీసీ లాయర్స్ జేఏసీ చైర్మన్ టి. రాజు, ఓరుగంటి వెంకటేశం, దేవరాజు, యాదగిరి, సదానందం, వేణుగోపాల్, లతా గౌడ్, స్వప్న, మట్ట జయంతి, కరుణ శ్రీ తదితరులు పాల్గొన్నారు.