09-02-2025 01:23:39 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ప్రభుత్వం కులగణన చేయడాన్ని అభినందిస్తున్నామని, కానీ సర్వే రిపోర్టులో బీసీల లెక్కలు సరిగా లేవని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ప్రత్యామ్నాయ పద్ధతులను పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు.
శనివారం సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌తో బీసీ సం ఘాల నేతలు, మేధావులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కులగణనపై సుదీర్ఘంగా చర్చించారు. రిపోర్టులో బీసీలకు జరిగిన అన్యాయన్ని గణాంకాలతో జాజుల శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. సమగ్ర కులగణనలో వివిధ కారణాల వల్ల పాల్గొనని లక్షలాదిమందికి రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు.
ఉపాధి కోసం వలస వెళ్లిన ప్రజలకు అవకాశం కల్పించడానికి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా వారిని భాగస్వామ్యం చేయాలన్నారు. సర్వే అశాస్త్రీయంగా జరిగిందని, దాన్ని పునఃసమీక్షించాలని కోరారు. అలాగే స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచి చట్టబద్ధత కల్పించడానికి రాష్ర్ట అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
బీసీల అవకాశాలను గండికొడుతున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమీక్షించడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.
సమావేశంలో ప్రభుత్వం తరఫున బీసీ కమిషన్ సభ్యులు, ఎంపీ సురేశ్ షెట్కర్, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ జ్ఞానేశ్వర్, ఖనిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, బీసీ సంఘాల తరఫున నేతలు ఆర్ కృష్ణయ్య, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమూర్తి, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, పలువురు బీసీ సంఘం నేతలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.