19-03-2025 01:00:19 AM
దేశ చరిత్రలో వాళ్లు వెయ్యేండ్లు వెనక్కి..
42 శాతం రిజర్వేషన్లు అసాధ్యం..
మండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న..
హైదరాబాద్, (విజయక్రాంతి): ప్రభుత్వాలకు బీసీలంటే చిన్నచూపని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు. దేశ చరిత్రలో బీసీలు వెయ్యేండ్లు వెనక్కి వెళ్లినట్టు పేర్కొన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు. ఇది ఉట్టి టైంపాస్ కార్యక్రమమేనని విమర్శించారు. పదేళ్లలో దేశంలోని బీసీలకు బడ్జెట్‌లో ఖర్చు చేసిన నిధులు కేవలం రూ.15,850 కోట్లేనన్నారు. మంగళవారం శాసనమండలిలో తీన్మార్ మల్లన్న బీసీ బిల్లులపై ప్రసంగించారు. 2023 కేంద్ర బడ్జెట్‌లో బీసీలకు రూ.2,287 కోట్లు మాత్రమే కేటాయించినట్టు గుర్తు చేశారు. 2019లో అగ్రవర్ణాలకు చెందిన 15 మందికి సంబంధించిన రూ.16 లక్షల కోట్లు రుణాలను దేశ పాలకులు మాఫీ చేశారని ఆరోపించారు.
పార్లమెంట్‌లో బీసీలకు న్యాయంగా 60 శాతం సీట్లు దక్కాల్సి ఉండగా కేవలం 13.74 శాతం సీట్లే దక్కుతున్నాయన్నారు. రాష్ట్రంలో 1952 మధ్య మొత్తం 1733 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే అందులో బీసీలు కేవలం 279 మంది మాత్రమే ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 21 శాతం మందే బీసీ ఉద్యోగులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నిరంగాల్లో బీసీలకు అన్యాయమే జరుగుతుందని ఆరోపించారు. రాజకీయంగా ఎదిగితే తప్ప బీసీలు అభివృద్ధి చెందరని అభిప్రాయపడ్డారు.